తెలంగాణ: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డికి రెడ్డికి సవాల్ విసిరిన తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి కేటీఆర్, రేవంత్ రెడ్డిని తీవ్ర విమర్శలతో ధ్వజమెత్తారు.
కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తన ప్రజలలో చిరాకును కలిగిస్తుందని, ఆయన మాటలు ఆవేశంలో ఉన్నవని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ మాట్లాడుతూ, రుణమాఫీ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందని, రేవంత్ రెడ్డి నేరుగా రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఆయన సవాల్ విసిరి, రేవంత్ రెడ్డి నిజాయితీతో ఉంటే కొడంగల్‌లో లేదా ఏ ఇతర ప్రాంతంలోనైనా 100% రుణమాఫీ జరిగినట్టు నిరూపించాలని కోరారు. సవాల్ స్వీకరించడంలో సిఎం రేవంత్‌కు ధైర్యం ఉంటే తన నియోజకవర్గానికి రేవంత్ రెడ్డిని తనతో మీడియాతో కలిసి వెళ్ళాలని అన్నారు. ఒక్క రైతు కూడా రుణమాఫీ పూర్తి అయ్యిందని చెబితే, తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని స్పష్టం చేశారు.
సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళ్ళాలని సవాల్ విసిరిన కేటీఆర్, రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళితే ప్రజలు ఆయనను ఫుట్బాల్ ఆడతారని సెటైర్లు వేశారు. రుణమాఫీని పూర్తిగా నెరవేర్చకుండా, కేవలం మాటలతో రాజకీయ లబ్ధి పొందడం దివాళా తీసిన ముఖ్యమంత్రి లక్షణమని, ఇంత దిగజారుడు ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదని అన్నారు. రైతులను మోసం చేసినందుకు రేవంత్ రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టాలనిచెప్పారు.
కేటీఆర్ పేర్కొన్న విధంగా, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, రేవంత్ రెడ్డి మానసిక స్థితిపై ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు జరుగుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటిమాటికీ ఢిల్లీకి వెళ్తున్నారని విమర్శించారు. ఇంత వరకు 19 సార్లు ఢిల్లీ వెళ్ళిన రేవంత్ రెడ్డి, తన పదేళ్ల పాలనలో కేసీఆర్ ఇన్ని సార్లు ఢిల్లీకి వెళ్లలేదని, ఇది ఓ రికార్డు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
సిఎం స్థాయి వ్యక్తి ప్రభుత్వ టీచర్లను ఇంత దిగజారిన స్థాయిలో ఇంటర్, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్లని చెప్పడం సరికాదని, ఇది ప్రభుత్వ పద్ధతులు కాదని, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.