హైదరాబాద్: హైదరాబాద్‌లో ఆకస్మిక వరదలు: ఒకరు మృతి, అనేక ప్రాంతాలు జలమయం
మంగళవారం తెల్లవారుజామున రాంనగర్‌లోని బాప్టిస్ట్ చర్చి సమీపంలో ఓ దినసరి కూలీ వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాడు. బాధితుడిని విజయ్ (43)గా గుర్తించగా, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు అతని మృతదేహాన్ని వెలికితీశారు.
వరదల కారణంగా నగరంలో సాధారణ జీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది.
ముఖ్యంగా సరూర్‌నగర్, ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, చార్మినార్, రాజేంద్రనగర్, అబిడ్స్, నాంపల్లి, మెహదీపట్నం, నాగోల్, తెల్లాపూర్, బోడుప్పల్, మధురానగర్, గచ్చిబౌలి, చైతన్యపురి, అమీర్‌పేట్, ముషీరాబాద్, శివరాంపల్లి, ఉప్పల్ వంటి ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా జలమయం అయ్యాయి.
భారీ వర్షాల వల్ల నగరంలోని రోడ్లు వరద నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్‌కు భారీ అంతరాయం కలిగింది. నెటిజన్లు ఈ పరిస్థితులపై తమ అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ, ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఉదయం 6 గంటలకు తేలికపాటి వర్షం ప్రారంభమైనప్పటికీ, అనేక గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా నగరం ఇంకా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు మంగళవారం మూసివేయబడ్డాయి. నగరంలో పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
జీహెచ్‌ఎంసీ నగరంలో ఎల్లో అలర్ట్‌ను ప్రకటిస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు, నగరం పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు.
జీహెచ్‌ఎంసీ-డీఆర్ఎఫ్ సహాయం కోసం పౌరులు 040-21111111 లేదా 9000113667కు డయల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇకపోతే, భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంగళవారం తెల్లవారుజామున 200కు పైగా ఫీడర్లలో సమస్య తలెత్తగా, ప్రస్తుతం ఏడు మినహా అన్నీ పునరుద్ధరించబడినట్లు టీజీఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. మిగతావి కూడా త్వరలోనే పునరుద్ధరిస్తామని చెప్పారు.
ఇక మరో ఘటనలో, సోమవారం తెల్లవారుజామున జోగులాంబ గద్వాల్ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు.
గద్వాల్ జిల్లా గట్టు మరియు మల్దకల్ ప్రాంతాల్లో వర్షం కురుస్తున్న సమయంలో వ్యవసాయ పొలాల్లో పిడుగుపాటుకు గురై 40 ఏళ్ల వ్యక్తి, 15 ఏళ్ల బాలిక వేర్వేరు చోట్ల మృతి చెందినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
అలాగే, నిజామాబాద్‌లో రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) కింద వరద నీటిలో చిక్కుకున్న పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులోని ప్రయాణికులను అధికారులు మరియు స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ఇకపోతే, ఆగస్టు 20న ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, హైదరాబాద్, మరియు ఇతర జిల్లాల్లో ఎక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.