fbpx
Thursday, January 2, 2025
HomeBig Storyకోల్‌కతాలో డాక్ట‌ర్ హ‌త్య కేసులో చిక్కుల్లో మమత ప్రభుత్వం

కోల్‌కతాలో డాక్ట‌ర్ హ‌త్య కేసులో చిక్కుల్లో మమత ప్రభుత్వం

Mamata’s government-trouble-case of the murder-trainee doctor

కోల్‌కతా: కోల్‌కతాలో ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఈరోజు కీలక విచారణ జరిగింది.

ఈ సంఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, పశ్చిమ బెంగాల్ మమతా ప్రభుత్వం, బెంగాల్ పోలీసులు, మరియు ఆసుపత్రి అధికార యంత్రాంగంపై పలు ప్రశ్నలు సంధించింది.

ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.

విచారణ సందర్భంగా కోర్టు పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, ఇది కేవలం హత్యకేసు మాత్రమే కాకుండా, వైద్యుల భద్రతపైన కూడా ఆందోళన కలిగించే ఘటన అని వ్యాఖ్యానించారు. పోలీసులు నేరం జరిగిన ప్రాంతంలో రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో జాప్యం ఎందుకు జరిగిందని, ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదని కోర్టు ప్రశ్నించింది.

ఈ దారుణ ఘటనపై ఆసుపత్రి వైద్యులు నిరసన వ్యక్తం చేస్తుండగా, ఆ నిరసనలను ప్రభుత్వ బలగాలను ఉపయోగించి బలవంతంగా ఆపవద్దని కోర్టు స్పష్టం చేసింది.

మరొక కీలక అంశంగా, బాధితురాలి వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో వెలుగుచూడడం, ఆమె మృతదేహాన్ని చూసేందుకు కుటుంబ సభ్యులను అనుమతించకపోవడం పై కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

మమతా ప్రభుత్వం, బెంగాల్ పోలీసుల తీరుపై కోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. “నేరం జరిగిన చోటా పోలీసులు ఏమి చేస్తున్నారు? బాధితురాలి మృతదేహాన్ని గార్డియన్‌కు అప్పగించిన మూడున్నర గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్ ఎందుకు దాఖలు చేయబడింది?” అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

అంతేగాక, 7 వేల మంది ఆసుపత్రిలోకి ప్రవేశిస్తే.. అక్కడ పోలీసులు ఏమి చేస్తున్నారు? అని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

మహిళల శ్రామికశక్తిలో వాటా పెరుగుతున్న కొద్దీ, వారి భద్రత పై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు.

ఈ కేసులో సీబీఐ స్టేటస్ రిపోర్టును ఆగస్టు 22న సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 22న జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular