ఆంధ్రప్రదేశ్: ఏపీలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో ఇటీవలే ఘోర ప్రమాదం చోటుచేసుకొని, 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ విషాద ఘటన ఇంకా మర్చిపోకముందే, అదే జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన అర్థరాత్రి 12:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఈ సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. హోంమంత్రిని నేరుగా ఆసుపత్రికి పంపించి, బాధితులతో మాట్లాడి, వారికి అన్ని విధాలా సాయం అందించాలని ఆదేశించారు.
అవసరమైతే ఎయిర్ అంబులెన్సులను వినియోగించి క్షతగాత్రులను తరలించాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఇదిలా ఉండగా, అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన ఫార్మాసిటీ ఘటనను సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.
ఈ ప్రమాదం తన మనసును కలచివేసిందని, ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇలాంటి సంఘటనలు జరగడం బాధకరం అని తెలిపారు.
ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా, 36 మంది గాయపడ్డారని, వీరిలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆయన తెలిపారు.
మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందించాలని, తీవ్రంగా గాయపడినవారికి రూ.50 లక్షలు, స్వల్ప గాయాలైనవారికి రూ.25 లక్షలు అందజేయనున్నట్లు సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.
“విశాఖపట్నం నాకు ఎంతో ప్రీతిపాత్రమైన నగరం అని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని” సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.