జమ్ము: జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉండగా, బీజేపీ) ఈ ఎన్నికల కోసం 44 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసింది.
అయితే, ఈ జాబితాను విడుదల చేసిన కొద్దిసేపటికే బీజేపీ అనూహ్యంగా దానిని ఉపసంహరించుకోవడం సంచలనంగా మారింది.
బీజేపీ వర్గాల ప్రకారం, కొన్ని కీలక మార్పులు చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందని, సవరణల అనంతరం కొత్త జాబితాను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
మొదటి దశ (సెప్టెంబర్ 18) కోసం 15 మంది అభ్యర్థులు, రెండవ దశ (సెప్టెంబర్ 25) కోసం 10 మంది అభ్యర్థులు, మూడవ దశ (అక్టోబర్ 1) కోసం 19 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ మొదట ప్రకటించింది.
అయితే, ఉపసంహరించిన జాబితాలో జమ్ము కాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, మాజీ ఉప ముఖ్యమంత్రులు నిర్మల్ సింగ్, కవీందర్ గుప్తాల వంటి ప్రముఖుల పేర్లు లేకపోవడం గమనార్హం.
బీజేపీ వర్గాల ప్రకారం, జమ్ముకశ్మీర్లో మరింత బలమైన నాయకులను బరిలో నిలబెట్టి, ఎన్నికల్లో విజయాన్ని సాధించాలన్న ఉద్దేశంతోనే కొన్ని మార్పులు అనివార్యమయ్యాయని తెలుస్తోంది.
జమ్ముకశ్మీర్లో ఎన్నికలు సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 1 వరకు మూడు దశల్లో జరుగుతుండగా, ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 4న వెలువడనున్నాయి.
ఈ పరిణామాలతో, జమ్ముకశ్మీర్ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠత తారాస్థాయికి చేరుకుంది.