న్యూఢిల్లీ: కోల్‌కతా ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ఒక మహిళా ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం-హత్య కేసుపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా స్పందించారు.
ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొంటూ, ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు.
దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలు మరింత ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ఇలాంటి క్రూరత్వాన్ని నాగరిక సమాజం ఇకపై భరించలేదని తేల్చిచెప్పారు.
ఆమె మాట్లాడుతూ, “ఇక చాలు” అంటూ సమాజంలో నెలకొన్న అసమానతలు, కఠినమైన సమాజ రీతులు, మహిళలపై దాడులు ఆపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
కోల్‌కతాలోని విద్యార్థులు, వైద్యులు, పౌరులు నిరసనలు వ్యక్తం చేస్తుండగా, నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారన్న ఆవేదన వ్యక్తపరిచారు. “ఇక చాలు. సమాజం సమగ్రంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజాయితీ, నిష్పాక్షికతతో మనం ముందుకు వెళ్లాలి,” అని ఆమె వ్యాఖ్యానించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన మాటలలో స్త్రీలపై జరుగుతున్న క్రూరత్వాల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
“మన సమాజంలో అసహ్యకరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు స్త్రీలను తక్కువగా, సమర్థతలేని వారిగా, తెలివితేటలు లేని వారిగా చూస్తారు. ఇది అంగీకరించలేని, జీర్ణించలేని సత్యం,” అని రాష్ట్రపతి అన్నారు.
2012లో నిర్భయ కేసు తర్వాత కూడా అనేక అత్యాచార ఘటనలు జరిగాయని, సమాజం వీటిని విస్మరించిందని, ఇది ఒక అసహ్యకరమైన అలవాటు అని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి దీనిని ‘సామూహిక మతిమరుపు’గా అభివర్ణించారు. “ఇప్పుడు భారతదేశం చరిత్రను పూర్తిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ వైకల్యాన్ని మనం కలిసి ఎదుర్కోవాలి, తద్వారా ఇది మొగ్గగానే నివారించగలిగే స్థితిలో ఉంటాం,” అని ఆమె పిలుపునిచ్చారు.
ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జరిగిన ఈ దారుణ సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపింది. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజలు నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.