ముంబై: భారతదేశంలో బంగారు రేటు గరిష్ట స్థాయికి చేరుకునంది, మొదటిసారిగా రూ .50 వేల మార్కుకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు 9 ఏళ్ల గరిష్టస్ధాయికి పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ఆల్‌టైం హైకి చేరుకుంది.
ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం ఏకంగా 500 రూపాయలు పెరిగి తొలిసారిగా రూ .50,026కు చేరింది. బంగారం బాటలోనే దూసుకెళ్లిన వెండి ఒక్కరోజులోనే రూ 3502 రూపాయలు పెరిగి ఏకంగా రూ 60,844కు ఎగబాకింది.
ప్రపంచం మొత్తం మీద కరోనా వైరస్ కేసులు భారీగా పెరగడంతో పాటు అమెరికన్ డాలర్ బలహీనపడటంతో యల్లోమెటల్‌కు గిరాకీ పెరిగింది. ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి అమెరికాలో మరో భారీ ప్యాకేజ్ ప్రకటిస్తారనే అంచనాలు కూడా బంగారం, వెండి కి డిమాండ్ పెంచాయి.
అనిశ్చిత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణానికి దీటుగా సురక్షిత రిటర్న్స్ అందిస్తాయనే నమ్మకంతో మదుపరులు బంగారం, వెండివంటి విలువైన లోహాల్లో పెట్టుబడులు పెడుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.
ముంబైకి చెందిన ఇండస్ట్రీ బాడీ ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) ప్రకారం, బంగారు ఆభరణాల ప్రారంభ రేటు 10 గ్రాములకు రూ 50,220 రూపాయలు, వెండి కిలోగ్రాముకు రూ 60,043 రూపాయలు గా నిలిచాయి.