న్యూఢిల్లీ: గత మూడు నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలను అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రాల్లోని వాగులు, వంకలు, నదులు అన్నీ ఏకమై పోయాయి.
పలు చోట్ల చెరువులు మరియు జనావాస ప్రాంతాలు అనే తేడా లేకుండా మొత్తం జలమయం అయ్యాయి. భారీగ వచ్చిన వరద నీటి విలయానికి ప్రజాజీవనం అస్తవ్యస్తం అయింది.
గత మూడున్నర దశాబ్దాలలో ఎప్పుడూ లేనంతగా ఈ సారి విజయవాడ, గుంటూరు నగరాల్లో భయంకరమైన వర్షం కురవడం జరిగింది.
ఈ ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయిన చంద్రబాబు నాయుడు మరియు రేవంత్ రెడ్డిలతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన ఏపీ, తెలంగాణలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సాయం అందిస్తామని తెలిపారు.
కాగా, రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని విజయవాడలోనే ఉంటున్నారు.
నిత్యం క్షేత్ర స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చూస్తున్నారు.
అలాగే రాష్ట్రంలోని ఇతర మంత్రులు మరియు ప్రజాప్రతినిధులను క్షేత్ర స్థాయిలో పరుగులు పెట్టించి పనులు చేయిస్తున్నారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిక వర్షం నమోదైన ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలపై పర్యవేక్షించారు.