జాతీయం: “ది బిగ్ బిలియన్ డేస్ 2024” (The Big Billion Days 2024) సేల్ కోసం వాల్‌మార్ట్ అనుబంధ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పనకు సిద్దమైంది.
దేశవ్యాప్తంగా లక్ష ఉద్యోగాలు సృష్టించబోతున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వినియోగదారులకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు, ఫ్లిప్‌కార్ట్ కొత్తగా తొమ్మిది నగరాల్లో 11 ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను ప్రారంభించింది, దీంతో ఈ సెంటర్ల సంఖ్య 83కు చేరింది.
ఈ పండగ సీజన్‌లో వినియోగదారులకు మెరుగైన సేవలందించడంలో, ఫ్లిప్‌కార్ట్ సప్లయ్ చైన్ విభాగంలో 1 లక్ష ఉద్యోగాలు సృష్టించే లక్ష్యంతో ఉంది.
ఈ నియామకాలు ఇన్వెంటరీ మేనేజర్లు, వేర్‌హౌస్ అసోసియేట్లు, లాజిస్టిక్స్ కోఆర్డినేటర్లు, కిరాణా భాగస్వాములు, డెలివరీ డ్రైవర్ల వంటి విభాగాల్లో ఉంటాయి. మహిళలు, దివ్యాంగులు, ఎల్‌జీబీటీక్యూఏఐ+ కమ్యూనిటీలకు చెందిన వారిని నియమించడానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఫ్లిప్‌కార్ట్ కొత్తగా ఉద్యోగాల్లో నియమించబడే వారిని శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించనుంది.
సీజనల్‌గా ఉండే ఈ ఉద్యోగాలు సాధారణంగా పండగల సీజన్ ముగిసిన తర్వాత కూడా కొంతమందికి కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు.
సామాజిక ఆర్థిక వృద్ధికి మద్దతుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు ఫ్లిప్‌కార్ట్ కట్టుబడి ఉందని వాల్‌మార్ట్ గ్రూప్ తెలిపింది.
ఈ నియామకాల ద్వారా కంపెనీ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా నిర్వహించబడతాయి, స్థానిక కమ్యూనిటీలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంది.