అమరావతి: రాష్ట్రానికి వాయుగుండం నుంచి ముప్పు తప్పింది. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలోని ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా పరిసరాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడింది.
ఇది ఉత్తర దిశగా కదులుతూ వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో ఈ వాయుగుండం ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇక రుతుపవన ద్రోణి సూరత్‌గఢ్ (రాజస్థాన్), రోహ్తక్ (హరియాణా), మండ్ల (మధ్యప్రదేశ్) మీదుగా అల్పపీడన కేంద్రం వరకు విస్తరించి, తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వ్యాపించింది.
ఈ ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.
శుక్రవారం రోజున శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ సముద్రం అలజడిగా ఉండే అవకాశముందని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గంటకు గరిష్ఠంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.
గురువారం నాడు పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విశాఖపట్నం, నంద్యాల, గుంటూరు, కాకినాడ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా విజయనగరం జిల్లా కొత్తవలసలో 94.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.