అమరావతి: విజయవాడలో కురిసిన భారీ వర్షాలు ప్రజల జీవితాల్లో తీవ్ర సమస్యలు సృష్టించాయి. వర్షాలు తగ్గినప్పటికీ, వరద పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. పలు కాలనీలు ఇంకా మోకాళ్ళ లోతు నీటితో నిండిపోయాయి. వరదల కారణంగా ప్రజలు ఇళ్లలోనే చిక్కుకుపోయి, తాగునీరు, ఆహారం వంటి నిత్యావసరాల కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వం చర్యలు
ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం, సహాయక చర్యలను విస్తృతంగా చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులతో కూడిన రేషన్ కిట్లను పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వం సహాయం అందిస్తోంది. సుమారు పదిలక్షల కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, లీటరు వంటనూనె, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల ఆలుగడ్డలు ఇవ్వనుంది.
ప్రత్యేక కార్యక్రమాలు, MDU వాహనాలు
రేషన్ కార్డు లేనివారికి కూడా ఆధార్ ఆధారంగా ఈ నిత్యావసర సరుకులను అందిస్తున్నారు. ప్రభుత్వ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి బాధితులకు ఆహారం, నీరు వంటి అవసరాలను పడవలు, వాహనాల ద్వారా అందిస్తున్నారు. నిత్యావసర సరుకులను ఇంటింటికీ చేరవేయడానికి MDU వాహనాలు ఉపయోగించబడుతున్నాయి.
గ్యాస్ సదుపాయం, ప్రత్యేక కేంద్రాలు
12 గ్యాస్ సర్వీస్ కేంద్రాలు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రజలకు గ్యాస్ సదుపాయాలు ఉచితంగా అందించనున్నారు. రేషన్ కార్డు లేని వారు ఆధార్ ఆధారంగా ఈ సేవలను పొందవచ్చు.
సహాయక కార్యక్రమాలు
వరద ప్రభావిత ప్రాంతాల్లో 1200 వాహనాలను సిద్ధం చేసి, బీఆర్‌టిఎస్ రోడ్డులో సహాయ కార్యక్రమాలను ప్రారంభించారు. ఇప్పటికే బహుముఖ సహాయ చర్యలు ప్రారంభమవడంతో పాటు, జనజీవనం త్వరగా కోలుకోవడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.
స్వచ్ఛంద సహాయం
ప్రభుత్వంతో పాటు వరద బాధితులకు అండగా ఉండేందుకు ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు పలు కంపెనీలు, స్వంచ్ఛంద సంస్థలు తోచినంత సాయం చేస్తూన్నాయి.