అమరావతి: మళ్ళీ బెజవాడకు బుడమేరు గండం?
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, బుడమేరు పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేస్తూ సోమవారం ఉదయం కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఇక్కడ నిరంతరం కురుస్తున్న భారీ వర్షాలతో, ఏ క్షణమైనా ఆకస్మిక వరదలు రావచ్చని హెచ్చరించారు. ముఖ్యంగా గుణదల, సింగ్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్న సూచనను జారీ చేశారు.
బుడమేరు వరద టెన్షన్
విజయవాడలో ఇప్పటికే మునుపటి వరదల నుంచి పూర్తిగా కోలుకోకముందే, ఇప్పుడు మరోసారి బుడమేరు ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది. బుడమేరులో నీటి ప్రవాహం పెరుగుతోందని, ఏ క్షణమైనా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. వరదలతో ఇప్పటిదాకా తీవ్రంగా నష్టపోయిన ఏడు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.
పెరుగుతున్న ప్రవాహం
బుడమేరులో వరద ప్రవాహం ఎప్పుడైనా భారీగా పెరగవచ్చని, అందుకే వెలగలేరు రెగ్యులేటర్ వద్ద నీటి మట్టం 2.7 అడుగుల వద్ద ఉందని అధికారులు తెలిపారు. అయితే, డిశ్చార్జి నిర్వహణ కోసం 7 అడుగులకు చేరే సమయంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు.
ప్రాంతాల్లో అప్రమత్తత
వరద ప్రభావంతో, బుడమేరు పక్కన ఉన్న ఎలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, సింగ్ నగర్, గుణదల వంటి లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలందరూ వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ఇప్పటికే అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
కృష్ణమ్మ ప్రవాహం మరోసారి భయాందోళన
ఇప్పుడే ముంపు నుంచి బయటపడుతున్న విజయవాడను మళ్లీ వరదల ఉద్ధృతి వెంటాడుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరిగి, ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం 13 అడుగులకు చేరింది. 70 గేట్ల ద్వారా 4 లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో, నగర ప్రజలలో మరింత ఆందోళన నెలకొంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తక్షణమే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని అధికారులు క్షేత్ర స్థాయిలో సమీక్షలు చేస్తున్నారు.