హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును పొగిడిన మాజీ మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే.
ఏపీ భారీ వర్షాలపై మాట్లాడుతూ, విజయవాడ ప్రాంతం వరదలతో అతలాకుతలమైందని, కానీ 74 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు వరద బాధితులను ఆదుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని అభినందించారు.
ఆయన 30 కిలోమీటర్లు వరద నీటిలో పర్యటించి ప్రజలను రక్షించడం గొప్పదని అన్నారు. చంద్రబాబు తన అనుభవంతో ప్రజలను ఈ విపత్తు నుంచి బయటకు తెచ్చారన్న విషయాన్ని ప్రత్యేకంగా గుర్తించారు.
ఈరోజు మల్లారెడ్డి తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై ఈ ప్రశంసలు కురిపించారు.
తిరుమల ఆలయానికి ఆయన అలిపిరి నడక మార్గం గుండా చేరుకున్నారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు.
ఇటీవలి కాలంలో మల్లారెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, దీనిపై స్పందిస్తూ, తాను ఎక్కడకీ వెళ్లడం లేదని స్పష్టం చేశారు.
ఒకవేళ పార్టీ మారితే, ఆ నిర్ణయాన్ని తానే ప్రకటిస్తానని అన్నారు. అలాగే, తెలంగాణ అభివృద్ధిని కేసీఆర్, కేటీఆర్ లు మళ్లీ తీసుకువస్తారని తనకు నమ్మకం ఉందని మల్లారెడ్డి అన్నారు.