విశాఖపట్నం: విశాఖలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ (మెడ్‌టెక్ జోన్) వైద్య పరికరాల తయారీలో కొత్త శిఖరాలను అధిరోహిస్తూ, అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకుంది. ఇప్పుడు, మరో ముందడుగుగా మెడ్‌టెక్ రంగంలో ఉన్నత స్థాయి శిక్షణ, పరిశోధన కోసం అంతర్జాతీయ స్థాయి మెడ్‌టెక్ విశ్వవిద్యాలయం స్థాపన జరుగుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన భవన నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ఇది పూర్తయితే, దేశంలోనే మొట్టమొదటి మెడ్‌టెక్ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందనుంది. ఈ విశ్వవిద్యాలయం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) మోడల్లో పారిశ్రామికవేత్తల సహకారంతో నిర్వహించబడుతుందని సమాచారం.
విశాఖ గ్లోబల్ హబ్‌గా అభివృద్ధి
విశాఖపట్నం మెడిటెక్ జోన్ వైద్య రంగంలో గ్లోబల్ హబ్‌గా ఎదుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, మెడిటెక్ జోన్ ఏర్పాటుతో ఏపీ వైద్య రంగంలో ప్రథమ స్థానంలో నిలుస్తుందని, తమ హయాంలో ఇది ప్రారంభమై విజయవంతమైందని పేర్కొన్నారు. 2019లో ప్రభుత్వం మారడంతో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, మెడిటెక్ జోన్ ప్రతినిధులు పట్టుదలతో ముందుకు సాగారని అభినందించారు.
సమావేశంలో చర్చలు, చంద్రబాబు వ్యాఖ్యలు
మెడిటెక్ జోన్ సిబ్బందితో జరిగిన సమావేశంలో చంద్రబాబు మరో రెండు కంపెనీల ప్రారంభం జరిగింది. గతంలో వైద్య పరికరాల కోసం ఇలాంటి జోన్ ఏర్పాటుపై అనుమానాలు ఉన్నాయని, కానీ ఇప్పుడు జరిగిన అభివృద్ధిని చూసి ఆనందంగా ఉందని చంద్రబాబు అన్నారు. కోవిడ్ సమయంలో, వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సిట్రేటర్లు, మొబైల్ కంటెయినర్ యూనిట్లు వంటి పరికరాలు ఇక్కడి నుండే తయారై, కోట్లాది ప్రజల ప్రాణాలను రక్షించాయని గుర్తుచేశారు.
మెడిటెక్ జోన్ ప్రాధాన్యత
275 ఎకరాల్లో 140కి పైగా కంపెనీలు పని చేస్తూ, 10 వేల కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాయి. 6 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. కోవిడ్ సమయంలో 20 రాష్ట్రాల వారు ఇక్కడ తయారైన సామాగ్రిని వినియోగించగా, ఏపీలో గత ప్రభుత్వం మాత్రం కొనుగోలు చేయలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని, విశాఖపట్నం నగరం తనకు ఎంతో ప్రీతికరమని చెప్పారు.