తెలంగాణ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆక్రమణలపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణ పోలీసు అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన మాట్లాడుతూ, “కొంత మంది ప్రాజెక్టుల వద్ద ఫాంహౌస్‌లు కట్టుకుంటూ వాటి నుంచి వచ్చే డ్రైనేజీని గండిపేటలో కలిపేస్తున్నారు. ఈ నాలాల ఆక్రమణల కారణంగా వరదలు వచ్చి పేదల ఇళ్లు మునుగుతున్నాయి.
చెరువులను ఆక్రమణల నుంచి విడిపించేందుకు హైడ్రాను ఏర్పాటు చేశాం. ఆక్రమణలు వదిలి గౌరవంగా తప్పుకోకపోతే, వాటిని కూల్చే బాధ్యత తీసుకుంటాం. కోర్టుల్లో స్టే తెచ్చుకున్నా, వాటిని సమర్థంగా ఎదుర్కొంటాం” అని పేర్కొన్నారు.
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి
హైదరాబాద్ కాలుష్యం నల్గొండకు చేరుతోందని, అందువల్ల ఆక్రమణలను తొలగించి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తామని సీఎం వెల్లడించారు. “మూసీ నది పరివాహక ప్రాంతంలో పేదల ఆక్రమణలు ఉన్నాయి. వారికి మానవతా ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. 11 వేల మంది బాధితులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తాం” అని వివరించారు.
టీజీపీఎస్సీపై నమ్మకం
“టీజీపీఎస్సీపై నిరుద్యోగులకు ఎలాంటి అనుమానాలు లేవు. గతంలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. కాని, ప్రస్తుత ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు ఇస్తోంది,” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “నిరుద్యోగుల అభ్యర్థన మేరకు గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేశాం. కుల వృత్తులు, చేతి వృత్తులను బలోపేతం చేయడం ద్వారా, వ్యవసాయం పండగగా మారిందని నిరూపించాం” అని అన్నారు.
నేరం జరగకుండా చూడటం కీలకం: డీజీపీ జితేందర్
డీజీపీ జితేందర్ మాట్లాడుతూ, “నేరం జరిగినప్పుడు మాత్రమే స్పందించడం కాదు, నేరం జరగకుండా చూడడం పోలీసుల ప్రాధాన్యత” అని పేర్కొన్నారు. సైబర్ నేరాల కట్టడిలో తెలంగాణ పోలీసుల కృషిని ప్రశంసించారు. “మారుతున్న సాంకేతికతను అనుసరించి పోలీస్ సిబ్బంది అప్డేట్ అవుతూ, ప్రజల నమ్మకం పొందడం ముఖ్యం” అని సూచించారు.
వరదబాధితులకు పోలీసుల విరాళం!
ఈ సందర్భంగా, రాష్ట్ర పోలీసులు ఒక రోజు జీతాన్ని తెలంగాణలో వరద బాధితులను ఆదుకోవడంకోసం విరాళంగా అందజేశారు. ఈ విరాళం మొత్తంగా రూ.11.06 కోట్లకు చేరింది. ఈ చెక్కును డీజీపీ జితేందర్ సీఎం రేవంత్ రెడ్డికి అందించారు.