అమరావతి : మాజీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం ప్రవర్తనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏపీలో నిజంగా ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో తుఫాను ముప్పు ఉందని ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ, చంద్రబాబు ప్రభుత్వం సమయానుకూలంగా చర్యలు తీసుకోకపోవడంతో 60 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు తన ఇంటిని రక్షించుకోవడమే లక్ష్యంగా విజయవాడను ముంచారని, వరదల నిర్వహణలో విఫలమయ్యారని ఆరోపించారు.
నందిగం సురేష్ పరామర్శ
జగన్ గుంటూరు జైలులో నందిగం సురేష్‌ను పరామర్శించారు. తుఫాను హెచ్చరికలు వచ్చినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది అన్నారు. ఆయన తన పర్యటనలో, టీడీపీ ప్రభుత్వం తుఫాను సమయంలో చేసిన తప్పులను ప్రశ్నించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నాలుగేళ్ల క్రితం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నందిగం సురేష్‌ను అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు.
చంద్రబాబు ప్రభుత్వానికి హెచ్చరిక!
బుడమేరు గేట్లు ఎత్తి విజయవాడను ముంచడం, ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల అంశంపై రాజకీయం చేయడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం చేసే అరెస్టులు, వేధింపులు ప్రజల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదేమైనా, తమ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని, అక్రమ అరెస్టుల రాజకీయాలు సునామీలా మారి టీడీపీకి నష్టం చేస్తాయని జగన్ హెచ్చరించారు.
పార్టీ కార్యాలయంపై దాడి అంశం
టీడీపీ కార్యాలయంలో తనను అనుచితంగా దూషించినందుకు, తనను అభిమానించే వారు ఆ కార్యాలయం వద్దకు వెళ్లారని జగన్ అన్నారు. దూషణలు సహించేవి కాదని, అయితే తాము 41ఏ నోటీసులు జారీ చేసి కోర్టుకు తరలించామని గుర్తు చేసారు. ఈ కేసులో నందిగం సురేష్‌తో సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎవరినైనా రాజకీయ కక్ష సాధింపుల కోసం రెడ్ బుక్‌లో పెట్టడం సరైన విధానం కాదని, ఇలానే తామూ చేస్తే ఇవే జైళ్లలో ఎవరెవరు వుంటారో ఆలోచించుకోవాలని జగన్ హెచ్చరించారు.
జగన్ నుండి కూటమి ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్
చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కదానికి కూడా న్యాయం చేయలేదని మండిపడ్డ జగన్, టీడీపీ అధినేతకు సంచలన వ్యాఖ్యలతో హెచ్చరిక చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.