కేరళ: కేరళలో నిఫా వైరస్ మరోసారి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఇటీవల మలప్పురం జిల్లాలో ఒక 24 ఏళ్ల యువకుడు నిఫా వైరస్ కారణంగా మరణించగా, ఈ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలకు ఉపక్రమించింది.
ఈ వ్యక్తి బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరాడు, చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆయన మృతికి కారణం నిఫా వైరస్ అని కొజికోడ్‌లో నిర్వహించిన వైద్య పరీక్షలు స్పష్టతనిచ్చాయి. పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కూడా ఈ వైరస్ సోకినట్లు ధృవీకరించింది.
కాంటాక్ట్ లిస్ట్, నియంత్రణ చర్యలు:
ఈ ఘటన అనంతరం 151 మందితో కూడిన కాంటాక్ట్ లిస్ట్‌ను అధికారులు రూపొందించి, వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కాంటాక్ట్‌లో ఉన్న ఐదుగురికి జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో వారిని ఐసోలేషన్‌లో ఉంచారు. నిపా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు మాస్క్‌లు తప్పనిసరి చేయడమే కాకుండా, తిరువలి పంచాయతీలో నాలుగు వార్డుల్లో థియేటర్లు, విద్యా సంస్థలను మూసివేశారు. సమూహాలు కూడడాన్ని నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకున్నారు.
గబ్బిలాల్లో నిఫా యాంటీబాడీస్:
కేరళలో గతంలోనూ నిఫా వైరస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. 2018, 2021, 2023లో కోజికోడ్ జిల్లాలో, 2019లో ఎర్నాకుళంలోనూ నిఫా కేసులు వెలుగు చూసాయి. ఈ జిల్లాల్లో గబ్బిలాలలో నిఫా యాంటీబాడీస్ గుర్తించడం, గబ్బిలాల ద్వారా వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉండటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
వైరస్ నియంత్రణకు చర్యలు:
ప్రభుత్వం 16 కమిటీలను ఏర్పాటు చేసి, నిఫా నియంత్రణ చర్యలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వైరస్ పట్ల అవగాహన కల్పిస్తూ, అత్యవసర సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో సూచిస్తోంది.