హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర అద్భుతంగా కొనసాగుతోంది. గణపతి దారిలోని ప్రతి చోట, రోడ్లపై, భవనాలపై నుంచీ భక్తులు తిలకిస్తూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
రోడ్లపై వాహనాల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు పటిష్టంగా ఏర్పాట్లు చేశారు. నగరంలో 64 ప్రధాన డైవర్షన్ పాయింట్లను ఏర్పాటు చేసి, కొన్ని ప్రాంతాల్లో విద్యాసంస్థలకు, కంపెనీలకు సెలవు ఇచ్చారు.
మహాగణపతి శోభాయాత్రలో భక్తులు భారీగా తరలి రావడంతో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును నిర్వహిస్తున్నారు. 700 మంది పోలీసులు శాంతిభద్రతలు పర్యవేక్షించగా, 56 సీసీ కెమెరాలు భద్రతకు నిఘా పెడుతున్నాయి. గంగమ్మ ఒడికి చేరుకునే దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తులు వేలాది సంఖ్యలో తరలి వస్తున్నారు.
ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడి ప్రత్యేకత ఏమిటంటే, 70 అడుగుల ఎత్తులో మహాగణపతి ప్రతిష్టించడం. మహా గణపతిని రూపొందించడంలో 200 మంది కార్మికులు ఒకటిన్నర నెలల పాటు శ్రమించారు. 11 రోజులపాటు లక్షలాది భక్తులు మహాగణపతిని దర్శించుకోగా, నిర్వాహకులు ఈ ఉత్సవాల ద్వారా రూ. కోటి 10 లక్షల ఆదాయం సమకూరిందని వెల్లడించారు.
మరోవైపు బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర కూడా ప్రారంభం కానుంది. లడ్డూ వేలం పట్ల ప్రజల ఆసక్తి అధికంగా ఉండగా, గతేడాది రూ. 27 లక్షల భారీ ధర పలికిన విషయం తెలిసిందే.