తెలంగాణ: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం: ‘బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం’ – సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ అంటేనే త్యాగం, బలిదానం అని, రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడిన చరిత్రను సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మంగళవారం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌లో తెలంగాణ ‘ప్రజాపాలన’ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.
అమరవీరులకు నివాళి
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మొదటగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
తన ప్రసంగాన్ని దాశరథి కవిత “ఓ నిజాము పిశాచమా..”తో ప్రారంభించి, తెలంగాణ త్యాగ చరిత్రను స్మరించారు. “తెలంగాణ అంటేనే త్యాగం, బలిదానం. రాచరిక వ్యవస్థపై తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోయిన ఘట్టం” అని ఆయన పేర్కొన్నారు.
చారిత్రాత్మక సెప్టెంబర్ 17
“తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. 1948 సెప్టెంబర్ 17న, నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి, బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైంది” అని సీఎం రేవంత్ తెలిపారు.
“ఇది కులం, మతం లేదా ప్రాంతానికి వ్యతిరేకంగా జరిపిన పోరాటం కాదు. ఇది ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం రాచరిక వ్యవస్థపై చేసిన సాయుధ తిరుగుబాటు. నాటి పోరాటంలో ఎందరో ప్రాణాలు అర్పించారు. వారి త్యాగాలను ఈ రోజు గుర్తు చేసుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు.
‘ప్రజాపాలన’ దినోత్సవం నామకరణంపై..
సెప్టెంబర్ 17న జరుపుకునే ఈ రోజును “విలీన దినోత్సవం” లేదా “విమోచన దినోత్సవం”గా పిలవాలన్న వివిధ అభిప్రాయాల మధ్య సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత “ప్రజాపాలన దినోత్సవం”గా అధికారికంగా నిర్వహించడం సరైనదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
“సెప్టెంబర్ 17, 1948న నిజాం రాచరికాన్ని కూలదోసిన ఘట్టం ప్రజల విజయం. ఇది రాజకీయం కాని చారిత్రక సంఘటన” అని సీఎం అన్నారు.
పారదర్శక పాలనకు కట్టుబాటు
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ, తన ప్రభుత్వం పారదర్శక పాలన వైపు అడుగులు వేస్తుందని సీఎం రేవంత్ చెప్పారు.
“ఫాంహౌస్ సీఎంను కాదు, పని చేసే ముఖ్యమంత్రిని” అని తనపై వస్తున్న విమర్శలను ఖండించారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో కఠిన చర్యలు తీసుకుంటున్నామని, టీ-న్యాబ్‌ను బలోపేతం చేశామని, యువతకు నైపుణ్యాలు పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు.
భవిష్యత్‌లో తెలంగాణ
“ఇప్పటి పాలకుల నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ ‘ఫ్లడ్స్ సిటీ’గా మారిందని, ప్రస్తుతం హైడ్రా ఏర్పాటుతో సమస్య పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నామని” ఆయన వివరించారు.
“ప్రతీ నిర్ణయం, ప్రతీ చర్యలో మహనీయుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ పని చేస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు.