న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆప్ నేత అతిషి మర్లేనా నియమించబడనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభా పక్ష సమావేశంలో, పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆమె పేరును ప్రతిపాదించగా, ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
దిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) రాజీనామా చేశారు. ఈ రోజు సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసిన ఆయన.. తన రాజీనామా లేఖను అందజేశారు. అతిషిని ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తూ, ఎమ్మెల్యేల మద్దతును తెలియజేస్తారు.
ఇంతకీ ఎవరీ అతిషి?
కేజ్రీవాల్ రాజీనామా తర్వాత, అతిషి పేరు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి రేసులో ప్రముఖంగా వినిపించింది. అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ పేరు కూడా ముఖ్యమంత్రి పదవి రేసులో వినిపించినప్పటికీ, ఆమె గాని, కేజ్రీవాల్ గాని ఆసక్తి చూపకపోవడంతో, సభాపక్షం అతిషిని సీఎంగా ప్రకటించింది.
43 ఏళ్ల అతిషి, ప్రస్తుతం ఢిల్లీ విద్యా శాఖ మరియు పీడబ్ల్యూడీ మంత్రిగా ఉన్నారు. ఆమె ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించారు. ఢిల్లీ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. 2020లో కల్కాజీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె, సిసోడియా అరెస్టు తర్వాత కేజ్రీవాల్ మంత్రివర్గంలో చేరారు.
అంతలోనే ఇంతలా..
2019లో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అతిషి, 4.77 లక్షల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి గౌతం గంభీర్ చేతిలో ఓడిపోయారు. 2020లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె, 2023లో మంత్రి అయ్యారు. ఇప్పుడు 2024లో, కేవలం ఏడాదిలోనే, ముఖ్యమంత్రి పదవిని అధిరోహించనున్నారు.