అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, సీఎం చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ నిర్వహించనున్నారు.
ఈ సమావేశం బుధవారం సాయంత్రం 4 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ప్రారంభమవుతుంది. సుమారు మూడు గంటల పాటు ఈ సమావేశం కొనసాగనున్నట్లు సమాచారం.
ఈ భేటీలో వందరోజుల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. అలాగే, కూటమి ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించి, వారికి ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలని చంద్రబాబు ప్రాథమికంగా భావించారు. అయితే, అవి సిద్ధంగా ఉంటే బుధవారం సమావేశంలోనే ఇవ్వడం లేదంటే తర్వాత ఇవ్వనున్నారు.
ఇటీవల టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తప్ప మిగతా మూడు పార్టీల ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపినట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు పాల్గొంటారు.
అదే రోజు ఉదయం రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం కూడా నిర్వహించనున్నారు.
మిత్రపక్షాలకు సీట్లు ఇచ్చిన నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌చార్జులతో పాటు, వైసీపీ గెలిచిన స్థానాల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థులతో కూడా విడిగా సమావేశం నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం సిద్ధమవుతోంది.