అమరావతి: ఏపీలో సెప్టెంబర్ చివరికి ఇప్పుడు ఉన్న మద్యం పాలసీ ముగియబోతోంది.
నూతన మద్యం విధానం కోసం ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం మంగళవారం సీఎంతో సమావేశమై తమ నివేదికను అందజ్జేసింది.
కాగా, ఇదే నివేదికను బుధవారం జరిగే కేబినెట్ ముందు ఉంచుతామని మంత్రివర్గ ఉపసంఘం సభ్యుడైన నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో అక్టోబరు 1వ తేదీ నుండి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, క్రిత ప్రభుత్వం లాగ కాకుండా తాము తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని ప్రకటించారు.
అలాగే మొదటిసారిగా కల్లుగీత కార్మికులకు రాష్ట్రంలోని 10 శాతం దుకాణాలు కేటాయించనున్నట్లు తెలిపారు.
నూతన మద్యం పాలసీ ప్రకారం… రాష్ట్రంలోని వైన్ షాపులను లాటరీ పద్ధతి ద్వారానే కేటాయిస్తారని, ఈ వైన్ షాపులు కేటాయించే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇస్తామని మంత్రి వివరించారు.
అలాగే మద్యంపై ఉన్న పన్నులను కూడా సవరిస్తామని తెలిపారు. కాగా గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను పూర్తిగా నాశనం చేసిందని ఆయన విమర్శలు చేశారు.
గత ప్రభుత్వం మద్యం దుకాణాల్లో జే బ్రాండ్లు విక్రయించారని మంత్రి రవీంద్ర తెలిపారు. మద్యం నియంత్రణ అని చెప్పి, ప్రజల జేబులు ఖాళీ చేశారని అన్నారు.
అలాగే అర్హతలేని ఒక వ్యక్తిని డిప్యుటేషన్ పై తెచ్చి ఎక్సైజ్ శాఖలో పెట్టారని, నకిలీ మద్యం బ్రాండ్లతో వారు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారని అన్నారు.