అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, పలు కొత్త నిర్ణయాలు తీసుకున్నారు.
ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ, మద్యం సరఫరా విధానం, భోగాపురం ఎయిర్‌పోర్టుకు పేరు పెట్టడం వంటి అంశాలు ప్రధానంగా ఉండాయి.
వాలంటీర్ వ్యవస్థ: సమగ్ర నివేదిక ఆదేశం
వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వాలంటీర్ వ్యవస్థపై సుదీర్ఘ చర్చ జరిగింది. మొత్తం 2.63 లక్షల మంది వాలంటీర్లు ఉన్నప్పటికీ, వారిలో 1.07 లక్షల మంది రాజీనామా చేశారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వం వాలంటీర్ల సేవలను పొడిగించకుండా మోసం చేసిందని విమర్శించారు.
వాలంటీర్ల ఆర్థిక సాయం నిలిపివేత
ప్రతి నెల వాలంటీర్లకు అందిస్తున్న రూ.200 పత్రిక కొనుగోలు సాయాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. దినపత్రికల కొనుగోలుకు గతంలో రూ.102 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ నిధుల వినియోగంపై విచారణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
మద్యం సరఫరా విధానంలో మార్పులు
ఆంధ్రప్రదేశ్ మద్యం సరఫరా విధానంలో కీలక మార్పులు తీసుకుంది. కేబినెట్ నిర్ణయం ప్రకారం, నాణ్యమైన మద్యం అన్ని రకాల బ్రాండ్లు కేవలం రూ.99కే అందుబాటులోకి రానున్నాయి. గతంలో రూ.120కి అమ్మిన మద్యం, ఇప్పుడు రూ.99కే లభించనుంది. ఈ చర్య ద్వారా మద్యం వినియోగంపై నియంత్రణతో పాటు వినియోగదారులకు ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది.
ప్రైవేట్ మద్యం దుకాణాలకు 2 సంవత్సరాల కాలపరిమితితో రూ. 2 లక్షలు అప్లికేషన్ ఫీజు నిర్ణయించారు.
ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరవడానికి అనుమతి ఉంటుంది.
లైసెన్స్ ఫీజులు రూ. 50 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు పెంచినట్లు తెలిపారు.
అంతేకాకుండా, ఏపీలో 12 ప్రీమియర్ మద్యం దుకాణాలకు 5 సంవత్సరాల అనుమతితో రూ. 15 లక్షల నాన్ రిఫండ్ ఫీజు, రూ. 1 కోటి లైసెన్స్ ఫీజు నిర్ణయించారు.
భోగాపురం ఎయిర్‌పోర్టు: అల్లూరి సీతారామరాజు పేరు
భోగాపురం ఎయిర్‌పోర్టుకు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఇకపై ఈ ఎయిర్‌పోర్టు “అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్”గా ప్రసిద్ధి చెందనుంది. ఈ నిర్ణయం స్వాతంత్ర్య సమరయోధుడి గౌరవార్థం తీసుకున్నారు.
ఆరోగ్య రంగంలో కొత్త పథకాలు
ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, కేబినెట్ “ఎలివేషన్ వయో కార్డియో-స్టెమీ” కార్యక్రమాన్ని ఆమోదించింది. ఈ పథకం ద్వారా ప్రాణాంతక హృదయ సంబంధిత జబ్బులను గుర్తించడం, రోగులను త్వరగా చికిత్సకు పంపడం సులభతరం అవుతుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు వారికి ప్రత్యేక “అపార్ ఐడీ కార్డులు” అందించాలని నిర్ణయించారు.
ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ పథకం
ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధి కోసం రాష్ట్రం మరింత ఆర్థిక సహాయం అందించనుంది. ఈ క్రమంలో, 20 లక్షల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో “క్రెడిట్ గ్యారెంటీ స్కీం”ను ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్రం పథకాలతో అనుసంధానం ద్వారా పారిశ్రామికాభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు.
మాజీ సైనికులకు కార్పోరేషన్
మాజీ సైనికోద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పార్థసారథి ప్రకటించారు. ఈ కార్పోరేషన్‌కు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ కేటాయించారు. దీనివల్ల మాజీ సైనికుల సంక్షేమం మరింత మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు.