విశాఖపట్టణం: విశాఖపట్టణంలో ఉన్న ప్రసిద్ధ సింహాద్రి అప్పన్న ఆలయంలో తాజాగా జరిగిన పరిణామం భక్తులలో తీవ్ర కలకలం రేపుతోంది.
ఆలయ అధికారులు భారీ మొత్తంలో నెయ్యిని సీజ్ చేయడంతో పాటు, ఆ నెయ్యి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. తిరుమల లడ్డూ వివాదం ఇప్పటికే దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన తరుణంలో, సింహాచలం ఆలయంలో నెయ్యి నాణ్యతపై అనుమానాలు వ్యక్తం కావడం భక్తుల ఆందోళనను మరింత పెంచుతోంది. ప్రసాదాల తయారీలో కల్తీ వస్తువులు వాడుతున్నారన్న వార్తలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.
నెయ్యి నాణ్యతపై తీవ్రమైన అనుమానాలు
సింహాచలం ఆలయంలోని ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యతపై భక్తులు గత కొన్ని రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదాలు, ముఖ్యంగా లడ్డూల నాణ్యతలో మార్పులు రావడం, వనస్పతి వాసన రావడం, తయారీ తర్వాత కొన్ని రోజుల్లోనే వాసన మారడం వంటి విషయాలు తరుచు భక్తుల నుండి వస్తున్న అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు.
తిరుపతి లడ్డు వివాదం నేపథ్యంలో అధికారులు అప్పన్న స్వామి గుడిలో సుమారు 945 కిలోల నెయ్యిని సీజ్ చేయడమే కాకుండా, నెయ్యి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపారు. నెయ్యి మాత్రమే కాకుండా, ప్రసాదాల తయారీలో వాడే ఇతర పదార్థాలనూ పరీక్షల కోసం ల్యాబ్‌కి తరలించారు.
నెయ్యి ధరలలో క్షీణత – అనుమానాలకు కారణం
సింహాచలం ఆలయంలో లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి ధరల విషయంలో సైతం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019 నుంచి నెయ్యి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తుండటం, భక్తుల నమ్మకానికి తీరని దెబ్బతీస్తోంది. 2019-21లో కిలో నెయ్యి ధర రూ.591గా ఉండగా, 2024 నాటికి కిలో ధర రూ.344కి పడిపోవడం వెనుక రహస్యం ఏమిటన్నది పరిశీలనలో ఉంది. నెయ్యి రేటు ఈ స్థాయిలో తగ్గడంతో కల్తీ వనస్పతి, జంతు కొవ్వు వంటి పదార్థాలు కలిసినట్టు భక్తులలో అనుమానం ఏర్పడింది.
గంటా శ్రీనివాసరావు ఆరోపణలు – వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు
భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ వివాదంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింహాచలం దేవస్థానంలోని ప్రసాదాల్లో నాణ్యత లేని పదార్థాలను వాడుతున్నారని ఆయన ఆరోపించారు. “భక్తులు నమ్మకంతో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తుంటే, వైసీపీ ప్రభుత్వం మాత్రం ప్రసాదాల నాణ్యత విషయం పట్టించుకోలేదు” అని ఆయన పేర్కొన్నారు.
భక్తుల మనోభావాలు దెబ్బ తీసి ప్రసాదాల్లో కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని గంటా చెప్పారు.
“ప్రసాదాల్లో నాణ్యత లేని పదార్థాలు వినియోగించడం పెద్ద తప్పిదం. మంచి వ్యవస్థను రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ నాశనం చేశారు. 2020-21లో రూ.591కి కిలో నెయ్యి సరఫరా చేస్తే.. 2024 ఏప్రిల్ నాటికి రూ. 344కి ఎలా సరఫరా చేస్తారనే ఆలోచన చేయకపోవడం సిగ్గుచేటు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముస్లింల ఆధ్వర్యంలోని సంస్థ 2022-23లో తక్కువ ధరలకు నెయ్యిని ఎలా సరఫరా చేయగలిగిందో తేలాలి. వైకాపా అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రంలోని ఆలయాల్లో జరిగిన ఇలాంటి అపచారాలకు జగన్‌కు శిక్ష విధించాలి. అది ఏ రకమైందో ప్రజలే చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలకు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అప్పటి తప్పిదాలకు భక్తులు మనస్ఫూర్తిగా క్షమించాలి. తిరుమల తరహాలోనే సింహాచలం క్షేత్రంలోనూ సంప్రోక్షణ జరిపించి భక్తుల మనోభావాలను గౌరవిస్తాం” అని గంటా వ్యాఖ్యానించారు.
ప్రసాదాల నాణ్యతపై ప్రభుత్వ దృష్టి
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల తయారీలో ఉపయోగించే పదార్థాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా సింహాద్రి ఆలయంలో భారీగా నెయ్యిని సీజ్ చేయడం జరిగింది. కల్తీ ఆరోపణల నేపథ్యంలో నెయ్యి, ఇతర పదార్థాలను పరీక్షల కోసం తరలించారు. ఈ తనిఖీలు మరింత విస్తృతమై రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో కొనసాగుతాయని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
63 డబ్బాలతోని 945 కేజీల నెయ్యి ఉండడాన్ని గుర్తించారు. వాటిల్లో వనస్పతి, పామాయిల్, ఇతరత్రా కలిపి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. లడ్డూ తయారీకి వినియోగించే ఇతర సరకుల నమూనాలను సైతం సేకరించి హైదరాబాద్ పంపించనున్నట్లు అధికారులు తెలిపారు.