కేరళ: భారత్‌లో మరో ప్రాణాంతక మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళకు చెందిన 38 ఏళ్ల వ్యక్తికి ‘క్లేడ్ 1బీ’ స్ట్రెయిన్ వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ప్రకటించింది. యూఏఈ నుంచి ఇటీవల ఇండియాకు వచ్చిన ఈ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ కేసు దేశంలో క్లేడ్ 1బీ వేరియంట్‌కు సంబంధించి నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మంకీపాక్స్ వ్యాధి – వివరాలు
క్లేడ్ 1బీ స్ట్రెయిన్ ప్రపంచ ఆరోగ్య ఆత్యయిక పరిస్థితిని సృష్టించిన ముఖ్య కారణం. 2022లో WHO ఈ వ్యాధిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించినప్పటి నుంచి భారత్‌లో 30కేసులు నమోదయ్యాయి. కేరళలో నమోదు అయిన తాజా కేసుతో దేశవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆరోగ్యశాఖ సూచించింది.
భారత్‌లో మొదటి మంకీపాక్స్ కేసు
సెప్టెంబర్ 9న దేశంలో మొదటి మంకీపాక్స్ కేసు నమోదైంది. ఫారిన్ నుంచి వచ్చిన వ్యక్తి పశ్చిమ ఆఫ్రికా నుంచి వ్యాపించిన క్లేడ్ 2 స్ట్రెయిన్‌తో బాధపడుతున్నాడు. ఆయనకు చికిత్స అనంతరం పూర్తిగా కోలుకుని, సెప్టెంబర్ 21న డిశ్చార్జ్ చేశారు.
కేరళ ఆరోగ్య శాఖ హెచ్చరిక
తాజా కేసు నేపథ్యంలో కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ విదేశాల నుంచి వస్తున్న వారు ఎటువంటి లక్షణాలు ఉన్నా వెంటనే ఆరోగ్యశాఖను సంప్రదించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐసోలేషన్, చికిత్స ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
మంకీపాక్స్ చరిత్ర
1958లో డెన్మార్క్‌లో కోతుల్లో మొదటిసారి వెలుగులోకి వచ్చిన ఈ వ్యాధి, 1970లో మానవుల్లో గుర్తించబడింది. 2005లో కాంగోలో వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. 2017 నుంచి అనేక దేశాలకు వ్యాప్తి చెందుతూ, 2022లో ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి.