హెల్త్ డెస్క్: కోపం – మన శత్రువు, మన ఆరోగ్యానికి ముప్పు
పెద్దలు చెప్పినట్లు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన రక్షణ. కోపం ఒక తీవ్రమైన భావోద్వేగం. కోపం కారణంగా మనిషి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాడు. దాని వల్ల మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం నాశనమవుతాయని వైద్యులు, శాస్త్రవేత్తలు స్పష్టంగా చెప్పుతున్నారు. అనవసరమైన కోపం మన జీవితంలో అనేక సమస్యలకు మూలం కావడమే కాకుండా, ప్రాణాంతకంగా కూడా మారవచ్చు.
తాజా పరిశోధనల ప్రకారం, ఎప్పుడూ కోపంతో ఉన్న వారికి గుండె సంబంధిత సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొలంబియా యూనివర్సిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్, యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు డా. ఇయాన్ ఎం. క్రోనిష్, డా. కరీనా డబ్ల్యూ డేవిడ్సన్ ఈ విషయాలపై చేసిన అధ్యయనాలు ఈ కోపం ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేశాయి.
కోపం ప్రభావం పై పరిశోధనలు
పరిశోధనల్లో భాగంగా, 18 నుంచి 73 సంవత్సరాల వయస్సు గల 280 మందిపై ప్రయోగాలు చేశారు. వారి కోపం, బాధ, ఆందోళన, ఒత్తిడి కలిగించే ఘటనలను గుర్తుకు తెచ్చేలా చేసి, రక్త నమూనాలను పరిశీలించారు. కోపంతో ఉన్నవారి రక్త నాళాలు విస్తరించే సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయినట్లు పరిశోధకులు కనుగొన్నారు.
ముఖ్యంగా, కోపం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని గుర్తించారు. కొన్ని నిమిషాల పాటు కోపంగా ఉండటం మాత్రమే కాదు, తీవ్రమైన భావోద్వేగాలు గుండెకు తీవ్రమైన దెబ్బతీస్తాయని ఈ పరిశోధనల ద్వారా తేలింది. కోపం వల్ల అధిక రక్తపోటు, తలనొప్పి వంటి సమస్యలు కూడా సాధారణమని నిపుణులు చెపుతున్నారు. ఇంకా కోపం మనిషి శారీరక ఆరోగ్యం మీద విపరీతమైన ప్రభావం చూపుతుందని క్రమంగా కోపం వల్ల గుండెజబ్బులు, పక్షవాతం, హార్మోన్ల అసమతుల్యతలు సహజమవుతాయని మానసిక వైద్యులు పేర్కొన్నారు.
కోపాన్ని అదుపులో ఉంచడం ఎలా?
కోపాన్ని అదుపులో ఉంచడం చాలా ముఖ్యమని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా, వ్యాయామం, యోగా, ధ్యానం వంటి వాటిని క్రమం తప్పకుండా చేయడం ద్వారా కోపం అదుపులో ఉండగలదని చెప్పారు. ఇవి నెమ్మదిగా శాంతిని తీసుకురావడంతోపాటు, శారీరక ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తాయి.
అలాగే, ప్రతిదినం కొంత సమయాన్ని మీ ఇష్టమైన అభిరుచుల కోసం కేటాయించడం మంచిదని, డ్యాన్స్, సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, పెయింటింగ్ వంటి క్రీయలతో మనసు ప్రశాంతంగా మారుతుందని, కోపం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
ముఖ్య గమనిక: ఈ వెబ్‌సైట్‌లో అందించిన ఆరోగ్య సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. కచ్చితంగా వ్యక్తిగత వైద్యుడి సలహాలు తీసుకోవడం ముఖ్యం.