అమరావతి: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ హఠాత్తుగా తన వాయిస్ వినిపిస్తున్నారు. “జస్ట్ ఆస్కింగ్” అంటూ తన ట్వీట్లతో పవన్‌పై విమర్శలు చేయడం, ఆయనను రెచ్చగొట్టడం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇటీవల “సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు” ఏర్పాటు ఆవశ్యకతపై పవన్ కల్యాణ్ మాటలకు కౌంటర్ ఇస్తూ ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు, ఆపై పవన్ ఆగ్రహంగా స్పందించడం ఈ వివాదానికి ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో, ప్రకాశ్ రాజ్ విధానం వెనుక ఏదైనా ప్రత్యేక రాజకీయ కారణం ఉందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ప్రకాశ్ రాజ్ బీజేపీ, హిందూత్వ విధానాలపై తీవ్రంగా విమర్శలు చేస్తూ “జస్ట్ ఆస్కింగ్” చేస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరు నుంచి ఎంపీగా పోటీ చేసినప్పటికీ, అక్కడ డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా, బీజేపీని వ్యతిరేకించడం మాత్రం ఆపలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన ప్రకాశ్, ఏపీ రాజకీయాల్లో అటువంటి పాత్ర పోషించకపోయినా, హఠాత్తుగా పవన్ కల్యాణ్‌పై తన విమర్శలను ఎక్కుపెట్టడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మొదట “సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు” పై చేసిన వ్యాఖ్యలతో ప్రకాశ్ రాజ్, పవన్‌ను టార్గెట్ చేశారు. దానికి పవన్ కౌంటర్ ఇచ్చారు. అయితే, ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ, “తన వ్యాఖ్యల్ని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారన్న” అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది మాత్రమే కాదు, కార్తీ లడ్డు వివాదంపై ‘సున్నితమైన’ వెటకారం ప్రదర్శించిన అంశం కూడా ఈ వివాదంలోకి వచ్చింది. ఈ అంశానికి సంబంధించి పవన్, ప్రకాశ్ మధ్య పరోక్షంగా వివరణలు జరిగాయి. కార్తీ పవన్ కు క్షమాపణలు చెప్పడం, కార్తీకి పవన్ బెస్ట్ విషెస్ చెప్పడంతో ఈ అంశం ముగిసినట్లు కనిపించినా, ప్రకాశ్ రాజ్ మళ్లీ దీనిపై ట్వీట్ చేస్తూ, “కారణం లేకపోయినా సారీ చెప్పించుకోవడం కరెక్టా” అంటూ పరోక్ష వాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్ పవన్‌ను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు అయోమయం అని ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ ట్వీట్‌పై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశ్ రాజ్ ఏజెండా ఏంటి?
ప్రకాశ్ రాజ్ హిందూ మనోభావాల విషయంలో అనవసరంగా తలదూరుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సెక్కులరిజం ముసుగులో కేవలం హిందూవ్యతిరేకతని అయన చాటుకుంటున్నట్టు స్ఫురిస్తోంది. ఆయనకు ఏపీతో నేరుగా ఎలాంటి సంబంధం లేకపోయినా, ఈ ప్రాంత రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడం వెనుక వైసీపీ మద్దతు ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రకాశ్ రాజ్ మెగా కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు ఆ సంబంధాలను పక్కన పెట్టి, ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టడం వెనుక రాజకీయ ప్రయోజనాలు కూడా ఉండొచ్చని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.