న్యూఢిల్లీ: గంగూలీ అనే పేరు క్రికెట్ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు రక్షణలో ఆడే జట్టు దూకుడుగా ఆడే జట్టుగా మారడానికి ప్రధాన కారణం సౌరవ్ గంగూలీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఎడమ చేతి వాటం బ్యాట్స్ మెన్ అయిన సౌరవ్ గంగూలీ కెప్టెన్ అయ్యాక భారత క్రికెట్ టీం లో సమూల మార్పులు వచ్చాయి. అతని నాయకత్వ లక్షణాలతో ఆటగాళ్ళకు ఎప్పుడూ అండగా ఉంటూ వారిని బాగా తీర్చిదిద్దాడు. అదే నాయకత్వ లక్షణాలతో బీసీసీఐ అధ్యక్షుడు కూడా అయ్యారు. ఇప్పుడు ఐసీసీ చైరన్ రేసులో కూడా పేరు వినబడే స్థాయికి గంగూలీ ఎదిగాడు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా నియమితులై పాలించేందుకు గంగూలీ అత్యంత సమర్థుడు మరియు అర్హుడు అని శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర అభిప్రాయ పడ్డాడు. గంగూలీ విజ్ఞత ప్రపంచ క్రికెట్ పరిపాలనలో చాలా ఉపయోగపడతాయని అతను అన్నాడు. ‘నా దృష్టిలో గంగూలీ ఎంతో సూక్ష్మబుద్ధి కలవాడు. క్రికెటర్‌గా అతని ఘనతలు చూసి మాత్రమే కాకుండా గంగూలీ తెలివితేటలు చూశాక నేను అతనికి వీరాభిమానినయ్యా’.
ఐసీసీ పదవిలో ఉన్న వ్యక్తి ఒక దేశానికే కాకుండా ప్రపంచం మొత్తంలో క్రికెట్ ఆడే దేశాలను సమానంగా చూసే వ్యక్తిత్వం, సమానభావం ఉండాలి. అలాంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నవాడు సౌరవ్ గంగూలీ. అలాంటి ప్రతిభావంతుడైన వ్యక్తి చేతిలో ఆ పదవి ఉంటే ప్రపంచ క్రికెట్ ఘనత ఇంకా పెరుగుతుంది అని నా నమ్మకం అని కుమార సంగకర్ర తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.