తిరుమల: జగన్ తిరుమల పర్యటన వివాదం
ప్రఖ్యాత తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతపై పెద్ద దుమారం రేగుతోంది. ముఖ్యంగా ఈ లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి చేప నూనెతో కల్తీ చేసారనే ఆరోపణలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన తర్వాత, రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చకు దారి తీసింది. తిరుమల లడ్డూ యొక్క పవిత్రతను, నాణ్యతను ప్రశ్నించేలా ఈ ఆరోపణలు రావడం వల్ల భక్తుల్లో ఆందోళన కలిగింది.
తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం చేసిన ఈ ఆరోపణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) పెద్ద ఎత్తున స్పందించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఆరోపణలను పూర్తిగా తిప్పికొట్టారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ రాజకీయ లబ్ధి కోసం కావాలనే తిరుమల ప్రసాదాన్ని దూషిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రతిస్పందనలో కీలక నిర్ణయాలు
వైసీపీ ఈ వివాదానికి గట్టి సమాధానంగా కీలక చర్యలు చేపట్టింది. శనివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లడ్డూ కల్తీ ఆరోపణల ద్వారా శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని, వీరి చర్యలు ఉద్దేశపూర్వకంగానే హైందవ విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయని వైసీపీ ఆరోపించింది.
జగన్ తిరుమల పర్యటన
వైఎస్ జగన్ స్వయంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు తిరుపతికి బయలుదేరి వెళ్లనున్నారు. 4:50 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి, శనివారం ఉదయం 10:30 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామి వద్ద గంట పాటు ఉండి, శ్రీవారి సేవలో పాల్గొని, 11:50 నిమిషాలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, మధ్యాహ్నం బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు.
జగన్ తన పర్యటనలో ఎలాంటి హడావుడి చేయకుండా ప్రశాంత వాతావరణంలోనే శ్రీవారి దర్శనం కావాలనుకుంటున్నానని పార్టీ క్యాడర్‌కు విజ్ఞప్తి చేశారు. కార్యకర్తలు, అభిమానులు తనకు స్వాగతం పలకవద్దని సూచించారు. తొలుత అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమలకు వెళ్లాలని జగన్ భావించినప్పటికీ, కాలి గాయంతో ఈ నిర్ణయాన్ని వాయిదా వేసి, కారులోనే తిరుమలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
డిక్లరేషన్ పై వివాదం
లడ్డూ కల్తీ వివాదంతో పాటు మరో కీలక అంశం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది, అదే వివాదాస్పద “డిక్లరేషన్” నిబంధన. 1990లో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ ప్రకారం, హిందూ ఆలయాలను సందర్శించడానికి ఇతర మతస్థులు ముందుగా డిక్లరేషన్ ఫారం సంతకం చేయాలి. ఈ ఫారంలో హిందూ మతంపై విశ్వాసం ఉన్నట్లు ప్రకటించి, ఆలయాన్ని దర్శించుకునే అనుమతి పొందుతారు. తిరుమలలో ఈ డిక్లరేషన్ ఫారం ప్రత్యేకంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 17వ కంపార్ట్‌మెంట్ లో ఉంచి ఉంటుంది.
ఇందులో “శ్రీ వెంకటేశ్వర స్వామిని, హైందవ మతాన్ని విశ్వసిస్తున్నాను” అని మతం ప్రకారం డిక్లరేషన్ చేయాల్సి ఉంటుంది. హిందూ సంప్రదాయ దుస్తులు ధరించటం తప్పనిసరి. ముఖ్యంగా కుర్తా పైజామా, దోతి వంటి సంప్రదాయ దుస్తులు మాత్రమే అనుమతించబడతాయి.
హిందూ ఆలయాల నిబంధనలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిబంధనల ప్రకారం, నిబంధన సంఖ్య 136 ప్రకారం హైందవులు మాత్రమే ఆలయంలోకి అనుమతించబడతారని స్పష్టంగా ఉంది. నిబంధన 137 ప్రకారం, హిందూ మతంపై విశ్వాసం ఉన్నవారు ప్రత్యేక డిక్లరేషన్ ఫారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించవచ్చు.
2014 సర్క్యులర్ ప్రకారం, హిందూయేతరులను గుర్తించినప్పుడు టీటీడీ అధికారులు డిక్లరేషన్ ఫారం ఇవ్వడం తప్పనిసరి. హిందువుల మత విశ్వాసాలను కాపాడటానికి ఈ నిబంధనలను రూపొందించారు.
జగన్ తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ మీద సంతకం చేస్తారా లేదా అని ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తోంది…