హైదరాబాద్: తెలంగాణ వరద బాధితులకు రిలయన్స్ ఫౌండేషన్ భారీ సహాయం – సీఎం సహాయనిధికి రూ. 20 కోట్ల విరాళం
తెలంగాణలో ఇటీవల వచ్చిన వరదలు రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించాయి. ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో మున్నేరు నది ఉగ్రరూపం దాల్చి పలు ప్రాంతాలను ముంచెత్తింది. ఈ విపత్తులో ప్రజలు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం పొందారు. బాధితుల సహాయార్థం దాతల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ సీఎం సహాయనిధికి భారీ విరాళం ప్రకటించింది. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 20 కోట్ల చెక్కును రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. శుక్రవారం రోజున, నీతా అంబానీ తరఫున రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ గ్రూప్ మెంటార్ పీవీఎల్ మాధవరావు కలిసి జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లి ఈ చెక్కును సమర్పించారు.
ఇటువంటి భారీ విరాళాన్ని అందించినందుకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో ఎవరూ విరాళం ఇవ్వలేదని సీఎం పేర్కొన్నారు.
ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సినీ తారలు, ప్రభుత్వ ఉద్యోగులు సహా పలు సంస్థలు వరద బాధితుల కోసం సహాయనిధికి విరాళాలను అందజేస్తున్నారు. టాలీవుడ్ హీరోలు చిరంజీవి, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, రాంచరణ్ వంటి వారు కూడా విరాళాలు ప్రకటించారు. అదేవిధంగా స్టేట్ బ్యాంకు ఉద్యోగుల సంఘం రూ. 5 కోట్లను విరాళంగా అందజేసింది. విశాఖ టీడీపీ ఎంపీ శ్రీ భరత్ తమ గీతం విద్యాసంస్థ తరఫున రూ. 1 కోటి విరాళం ప్రకటించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చిన ఈ భారీ వరదలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసినప్పటికీ, విరాళాల రూపంలో అందుతున్న సాయం బాధితులకు కొంత ఊరట కలిగిస్తోంది.