మధ్య సిరియా: సిరియాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో భాగంగా అమెరికా బలగాలు మరోసారి విరుచుకుపడ్డాయి. తాజా వైమానిక దాడుల్లో 37 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ దాడుల్లో హతమైనవారు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) మరియు అల్ ఖైదా అనుబంధ గ్రూపులకు చెందినవారని అధికారికంగా వెల్లడించారు.
అమెరికా బలగాలు నిర్వహించిన ఈ దాడుల్లో హుర్రాస్ అల్-దీన్ గ్రూప్‌కు చెందిన సీనియర్ ఉగ్రవాది సహా మరో ఎనిమిది మంది లక్ష్యంగా చేయబడినట్లు పేర్కొంది. ఆయా ఉగ్రవాదులు సిరియాలో సైనిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారని సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇదే సమయంలో, మధ్య సిరియాలోని ఐసిస్ శిక్షణ స్థావరంపై కూడా పెద్ద ఎత్తున దాడి నిర్వహించి 28 మంది ఉగ్రవాదులను అంతమొందించారు.
ఈ దాడులతో ఐసిస్ గ్రూప్ శక్తిని తగ్గించామని, వారికి వ్యతిరేకంగా భవిష్యత్ కార్యకలాపాలను నిరోధించేందుకు ఆపరేషన్లు కొనసాగిస్తామని అమెరికా వెల్లడించింది. అలాగే, అమెరికా మిత్రదేశాలు మరియు భాగస్వాములను రక్షించేందుకు ఈ దాడులు కీలకమని పేర్కొంది. పశ్చిమాసియా ప్రాంతంలో మళ్ళీ ఐసిస్ గ్రూప్ ఎదగకుండా అడ్డుకునేందుకు సిరియాలో 900 మంది భద్రత సిబ్బందిని మోహరించామని అగ్రరాజ్యం స్పష్టం చేసింది.
ఇజ్రాయెల్ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై దాడులు చేయడంతో, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిణామాల నడుమ, సిరియాలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలు మరింత వేగంగా సాగుతున్నాయి.