వాషింగ్టన్: కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఆశగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో అమెరికాలో మోడెర్నా వ్యాక్సిన్ పై కీలక ఘట్టానికి రంగం సిద్ధమయ్యింది. అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్, మోడెర్నా కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఈ రోజు 30 వేల మంది వాలంటీర్లపై ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు.
ఇందుకోసం కావలసినన్ని డోసులను సిద్ధం చేసినట్లు తెలిపింది. ఈ వ్యాక్సిన్ పరీక్షలను మోడెర్నా మార్చిలోనే ప్రారంభించింది. తొలుత 45 మంది వాలంటీర్లపై ప్రయోగించింది. అందులో సానుకూల ఫలితాలు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం భారీ ఎత్తున నిర్వహించే పరీక్షలతో వ్యాక్సిన్ అసలు సామర్థ్యం బయటపడే అవకాశముందంటున్నారు నిపుణులు.
ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ఈ కంపెనీపై తొలుత ప్రకటించిన పెట్టుబడిని రెట్టింపు చేసింది. గతంలో 483 మిలియన్ల డాలర్లు ప్రకటించిన ప్రభుత్వం, తాజాగా వ్యాక్సిన్ తయారీ సంస్థకు అదనంగా 472 మిలియన్ల డాలర్లు కేటాయించింది. మోడెర్నా బయోటెక్నాలజీ కంపెనీ ఈ విషయాన్ని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
దాదాపు 30వేల రోగులపై మోడెర్నా మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయి. వ్యాక్సిన్ పరీక్షల కోసం దాదాపు 1,50,000 మంది అమెరికన్లు స్వచ్ఛందంగా తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
వీరిలో వేర్వేరు ప్రాంతాల నుంచి సుమారు 30 వేల మందిని ఎంపిక చేసినట్టు అధికారులు తెలిపారు. అంతేకాక వీరిలో కొందరికి అసలు వాక్సిన్, మరి కొందరికి డమ్మీ వెర్షన్ ఇవ్వనున్నారు. అనంతరం వీరందరి రోజు వారి దినచర్యలను.. వారి ఆరోగ్యంలో వచ్చే మార్పులను నిశితంగా పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు.