న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పన్నుల విధానంలో కొత్త నిబంధనలు తీసుకువచ్చి, అక్టోబర్ 1, 2024 నుండి అమల్లోకి రానున్నాయి. వీటితో పాటు ఆధార్ కార్డు, సబ్సిడీ, పీపీఎఫ్ రేట్లు, షేర్ల బైబ్యాక్, బాండ్లపై కీలక మార్పులు జరుగుతున్నాయి. ఈ నిబంధనలతో దేశంలోని పన్ను చట్టాలు మరింత సమగ్రతను సంతరించుకుంటున్నాయి. కొత్త మార్పులను క్షుణ్ణంగా తెలుసుకుందాం.
ఆధార్ ఆధారంగా పన్ను రిటర్నులు
ఇప్పటి వరకు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి లేదా పాన్ కార్డు దరఖాస్తు చేసేందుకు ఆధార్ కార్డు లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ఉండాలి. ఇకపై కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఇది పన్ను చెల్లింపులను మరింత సరళతరం చేసే మార్పుగా భావిస్తున్నారు.
సబ్సిడీ సౌకర్యాలు
ప్రధానమంత్రి ఇ-డ్రైవ్ యోజన స్కీమ్ కూడా ఈరోజు నుండి అమల్లోకి వస్తోంది. ద్విచక్ర మరియు త్రిచక్ర వాహనాలు కొనుగోలు చేసే వారికి రూ. 50,000 వరకు సబ్సిడీ లభించనుంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే సాధారణ ప్రజలకు ఎంతో మేలు చేయబోతుంది.
ఆస్తి అమ్మకాలు
అక్టోబర్ 1 నుండి రూ. 50 లక్షలకు మించి స్థిరాస్తి విక్రయించే వారిపై 1% టీడీఎస్ (Tax Deducted at Source) విధించనున్నారు. ఈ మార్పుతో ఆస్తి క్రయ-విక్రయాల ద్వారా మరింత ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
పీపీఎఫ్ వడ్డీ రేట్లు
ప్రజా ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఖాతాల్లో మైనర్లు మేజర్లు అయ్యాక వడ్డీ రేట్లు వర్తించే కొత్త విధానం ఈ రోజు నుండి అమల్లోకి వస్తుంది.
షేర్లు బైబ్యాక్
ఇంతకుముందు షేర్లు బైబ్యాక్ చేసినప్పుడు కంపెనీలపై పన్ను బాధ్యత ఉండేది. కానీ ఇప్పుడు ఆ బాధ్యత వాటాదారులపైకి మారింది. ఈ మార్పు కంపెనీలకు మేలు చేస్తుందని భావిస్తున్నారు.
బాండ్లపై పన్ను విధానం
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన బాండ్లపై వచ్చే వడ్డీకి 10% పన్ను కోత ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో బాండ్లపై వచ్చిన ఆదాయం రూ. 10,000కు మించితే టీడీఎస్ (TDS) విధిస్తారు.