ఆంధ్రప్రదేశ్: ఏపీలో ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య పరీక్షలు (PMT/PET) ఐదు నెలల్లోగా పూర్తవుతాయని ఆమె వెల్లడించారు. 2022లో జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు 4,59,182 మంది హాజరుకాగా, 95,209 మంది తదుపరి దశకు ఎంపికైనట్టు తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇతర రాజకీయ పరిణామాల కారణంగా గతంలో నియామక ప్రక్రియ వాయిదా పడినట్లు అనిత గుర్తుచేశారు. అయితే, ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం న్యాయ సలహా తీసుకొని, శారీరక సామర్థ్య పరీక్షలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.
హైకోర్టు ఉత్తర్వులు:
హోంగార్డులు న్యాయస్థానంలో వేసిన పిటిషన్ల కారణంగా నియామక ప్రక్రియ నిలిచిపోయిందని అనిత వెల్లడించారు. 100 మంది హోంగార్డులు కోర్టు ద్వారా ప్రత్యేక కోటాను కోరగా, హైకోర్టు వారిని తదుపరి దశకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్ల కారణంగా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోయిందని ఆమె వివరించారు.
ప్రస్తుతం, SLPRB (slprb.ap.gov.in) వెబ్‌సైట్‌లో రెండవ దశకు సంబంధించిన వివరాలు పొందుపరుస్తామని, ఫిజికల్ టెస్టుల తర్వాత మూడవ దశకు ఫైనల్ రాత పరీక్ష నిర్వహించనున్నట్లు హోంమంత్రి అనిత పేర్కొన్నారు.