టెల్ అవీవ్: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ భీతితో ఉద్రిక్తతలు పెరిగాయి. అంట అనుకున్నట్టుగానే జరిగింది. లెబనాన్‌లో జరిపిన దాడుల నేపథ్యంలో, ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు జరిపింది. అర్థరాత్రి వేళ ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైల్ దాడులు ప్రారంభించి, మూడు గంటల పాటు వరుసగా క్షిపణులు ప్రయోగించింది. హెజ్బొల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా మరణానికి ప్రతీకారంగా ఈ దాడి జరిపినట్టు ఇరాన్ ప్రకటించింది.
ఈ దాడిలో ఇజ్రాయెల్‌లోని వైమానిక స్థావరాలు, ఆర్మీ క్యాంపులు, వాణిజ్య కేంద్రాలు, ప్రధాన భవనాలు లక్ష్యంగా మారాయి. దాదాపు 400 క్షిపణులు ప్రయోగించగా, టెల్ అవీవ్ నగరంలో పౌరులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటన కూడా చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో కనీసం 10 మంది గాయపడగా, వారిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అంతకుముందే అమెరికా ఇలాంటి దాడులు జరగవచ్చని హెచ్చరించడంతో, ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఇరాన్ త్వరలో ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడి చేసే అవకాశముందని అమెరికా ముందుగానే హెచ్చరించింది. ఇటువంటి దాడులకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని కూడా అమెరికా ముందే ఇరాన్ ను హెచ్చరించింది.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారంగా, హిజ్బొల్లా టెల్ అవీవ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్‌ను తమ చీఫ్ హసన్ నస్రల్లాకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ఇరాన్ నుంచి వచ్చే మరిన్ని దాడులకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో, రష్యా లెబనాన్‌లోని ఇజ్రాయెల్ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని కోరింది.
ఇదిలా ఉండగా, ఈ దాడులకు తప్పనిసరిగా తీవ్ర పరిణామాలను ఇరాన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకోవడం పట్ల, ఇదెటు దారితీస్తుందోననే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
భారత రాయబార కార్యాలయం హెచ్చరిక!
భారత రాయబార కార్యాలయం ఇజ్రాయెల్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, భారతీయులు పశ్చిమాసియాలో అనవసర ప్రయాణాలు చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసర పరిస్థితులలో 24/7 పని చేసే +972-547520711, +972-543278392 హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా సహాయం పొందవచ్చని తెలిపింది.