ఇంటర్నేషనల్ డెస్క్: పశ్చిమాసియా ప్రాంతం గత కొంతకాలంగా శాంతిస్తుందని భావించినా, గత పక్షం రోజుల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాల వలన ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. గత సంవత్సరం అక్టోబరులో హమాస్‌తో మొదలైన ఈ సమస్య ఇప్పుడు పేజర్ల దాడుల వలన మరింత తీవ్రరూపం దాల్చింది.
గాజా పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ ప్రధాన నగరాలపై ఇరాన్ మద్దతుతో చెలరేగిన హిజ్బుల్లా ఉగ్రవాదులు దాడులు చేయడం, ఇజ్రాయెల్ తన కౌంటర్ దాడులను మరింత ఉధృతం చేయడం చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా, రష్యాలు కూడా ఈ వివాదంలోకి తలదూర్చడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారిపోయింది.
అసలు గత 14 రోజులలో ఏమి జరిగింది?
సెప్టెంబర్ 17: ఇజ్రాయెల్ ఆధ్వర్యంలో లెబనాన్, సిరియా వ్యాప్తంగా పేజర్ల పేలుళ్ల వలన 13 మంది మరణించారు, 4,000 మంది గాయపడ్డారు. హిజ్బుల్లా స్థావరాలపై ఈ దాడులు జరిగినట్లు నిర్ధారణ.
సెప్టెంబర్ 18: వాకీ-టాకీలతో సహా కమ్యూనికేషన్ పరికరాలు పేలడంతో మరో 14 మంది మరణించారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ “అద్భుతమైన విజయాలు” “ఆకట్టుకునే ఫలితాలు” అంటూ ట్వీట్ చేసినప్పటికీ, పేలుడు ప్రస్తావన చేయలేదు.
సెప్టెంబర్ 19: దక్షిణ లెబనాన్‌లో వందలాది రాకెట్ లాంచర్లతో హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించాయి.
సెప్టెంబర్ 20-22: బీరుట్ శివారులో జరిగిన దాడుల్లో హిజ్బుల్లా సైనిక కమాండర్ ఇబ్రహీం అకిల్ హతమయ్యాడు. హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగేలా ఉన్నాయి.
సెప్టెంబర్ 23: దక్షిణ లెబనాన్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించిన అనంతరం ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడిలో 550 మంది మరణించారని లెబనాన్ ప్రభుత్వం ప్రకటించింది.
సెప్టెంబర్ 24-25: ఇజ్రాయెల్ బీరుట్‌లో చేసిన దాడిలో హిజ్బుల్లా క్షిపణి విభాగ అధిపతి ఇబ్రహీం కొబీస్సీ హతమయ్యాడు. మరోవైపు హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై సుదూర క్షిపణిని ప్రయోగించినా, ఇజ్రాయెల్ దళాలు దానిని నిలువరించాయి.
సెప్టెంబర్ 26: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో 21 రోజుల కాల్పుల విరమణ ప్రణాళికను US, ఫ్రాన్స్ ప్రతిపాదించాయి. కానీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దానిని తిరస్కరించారు.
సెప్టెంబర్ 27: నెతన్యాహు UNGA ప్రసంగంలో ఇరాన్, దాని ప్రాక్సీలపై దాడి చేసే సత్తా తమకుందని ప్రకటించారు. అదే రోజు దక్షిణ బీరుట్‌లో హిజ్బుల్లా ప్రధాన కార్యాలయాన్ని ఇజ్రాయెల్ వైమానిక దాడులు నేలమట్టం చేశాయి.
సెప్టెంబర్ 28: హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
సెప్టెంబర్ 29-30: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ జనరల్ అబ్బాస్ నిల్ఫోరుషన్ మరియు హిజ్బుల్లా ఉన్నత స్థాయి అధికారి నబిల్ కౌక్ మరణించారు.
అక్టోబర్ 1: ఇరాన్ ప్రతీకారంగా కనీసం 400 క్షిపణులను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. ఈ దాడులు మధ్యప్రాచ్యంలో ప్రాంతవ్యాప్త యుద్ధ భయానికి దారితీశాయి.
ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరిస్థితులు ఎలా మలుపుతీసుకుంటాయో అనే భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.