అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని మందుబాబులకు భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో పది రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ అవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇది అక్టోబర్ 12 నుంచి అమల్లోకి రానున్న కొత్త మద్యం విధానం, కాంట్రాక్టు ఉద్యోగుల నిరసనల కారణంగా చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించడంతో, ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసిన కాంట్రాక్టు సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 30తో వారి కాంట్రాక్టులు ఇప్పటికే ముగియడంతో, వారికి ప్రత్న్యమ్యాయ అవకాశాలపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ పదిరోజులలో వారికెమి భవిష్యత్తు ఉంటుందో అన్న అనుమానంతో సిబ్బంది దుకాణాలకు హాజరుకావడం మానేశారు.
అక్టోబర్ 2 గాంధీ జయంతి కావడంతో, ఆవేళ మాత్రమే మద్యం దుకాణాలు బంద్ అవుతాయని ముందుగా ఊహించిన మందుబాబులకు పది రోజులు వైన్ షాపులు తెరుచుకోకపోవడమనేది శరాఘాతమే! షాపులు ముందుగానే మూసివేయడం ప్రారంభమవడంతో, తమకు కావాల్సిన మద్యం నిల్వ చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.
కొత్త మద్యం పాలసీ అక్టోబర్ 12న ప్రారంభమవుతోంది. ఇందులో భాగంగా మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించనున్నారు. దీనివల్ల ప్రస్తుతం కాంట్రాక్టు ఆధారితంగా పనిచేసిన సిబ్బందికి ఉద్యోగాలు లేకపోవడం ఖాయం అని భావిస్తున్నారు. సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అలాగే, ఈ పదిరోజుల పాటు మద్యం దుకాణాలు తెరుచుకోవాలని ప్రభుత్వం కోరినప్పటికీ, కాంట్రాక్టు సిబ్బంది దుకాణాలకు రావటానికి నిరాకరించారు. దీంతో అక్టోబర్ 2తో పాటు మరో పదిరోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ అవుతున్నాయి.