fbpx
Friday, October 18, 2024
HomeNational"దేశానికి జాతిపితలు ఎవరూ లేరు" గాంధీ జయంతి వేళ కంగనా సంచలన పోస్ట్‌!

“దేశానికి జాతిపితలు ఎవరూ లేరు” గాంధీ జయంతి వేళ కంగనా సంచలన పోస్ట్‌!

Kangana-sensational-post-on-the-occasion-of-Gandhi-Jayanti

న్యూస్ డెస్క్: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్ట్‌లో గాంధీని కించపరిచినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. “దేశానికి జాతిపితలు అంటూ ఎవరూ లేరు, కేవలం కుమారులు మాత్రమే ఉన్నారు” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు, గాంధీని కించపరిచేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కంగనా లాల్ బహదూర్ శాస్త్రి వంటి నాయకులు భారతమాతకు గర్వించదగ్గ బిడ్డలని పేర్కొంది.

కంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర స్పందన వచ్చింది. కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాతే గాంధీ జయంతి సందర్బంగా వ్యాఖ్యలపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. గాడ్సే ఆరాధకులు మహాత్మా గాంధీకి అగౌరవం చేసేలా వ్యాఖ్యలు చేయడం విడ్డూరమని, నరేంద్ర మోదీ “ఈ కొత్త గాడ్సే భక్తురాలిని క్షమిస్తారా?” అంటూ ప్రశ్నించారు. గాంధీ వంటి మహనీయులు దేశానికి జాతిపితలుగా ఉన్నారు, వారిని తక్కువ చేయడం హేయమని సుప్రియా పేర్కొన్నారు.

ఒకవైపు గాంధీపై నెగటివ్ వ్యాఖ్యలు చేసిన కంగనా, మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశమైంది. గాంధీజీ పరిశుభ్రత వారసత్వాన్ని కొనసాగిస్తూ, స్వచ్ఛ భారత్‌ ద్వారా దేశంలో పరిశుభ్రతకు పెద్ద పీట వేసినందుకు కంగనా మోదీని అభినందించారు.

పంజాబ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత మనోరంజన్ కాలియా కూడా కంగనా వ్యాఖ్యలను ఖండించారు. గాంధీ 155వ జయంతి సందర్భంగా కంగనా చేసిన వ్యాఖ్యలు తగినవిగా లేవని తెలిపారు. కంగనా తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్నారని, ఆమె రాజకీయాలు ఎరిగిన వ్యక్తి కాదని ఆయన సర్దిచెప్పే ధోరణి ప్రదర్శించారు. రాజకీయం అనేది అత్యంత బాధ్యతతో వ్యవహరించాల్సిన అంశమని, ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.

కంగనా రనౌత్ తన వివాదాస్పద వ్యాఖ్యలను ఆపకపోవడం, ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల ఉద్యమం, కేంద్రం వెనక్కి తీసుకున్న సాగు చట్టాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు గతంలో కూడా తీవ్ర విమర్శలకు దారితీశాయి. రైతుల ఉద్యమ సమయంలో బంగ్లాదేశ్‌ పరిస్థితులు వస్తాయని, చైనా, అమెరికాల కుట్రల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, ఆ ఉద్యమాల ప్రదేశాల్లో శవాలు వేలాడుతున్నాయని పేర్కొంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆ తర్వాత ఈ వ్యాఖ్యలను ఆమె వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.

ఈ క్రమంలో కంగనా రనౌత్ ప్రవర్తనపై బీజేపీ సొంత నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఓ ప్రజాప్రతినిధిగా ఉండగా, పౌరులు గౌరవించే వ్యక్తిగా హుందాగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఏది పడితే అది మాట్లాడటం పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఉంటుందని ఆమెపై మండిపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular