హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టారు. పేద మరియు మధ్యతరగతి ప్రజల కోసం, రాష్ట్రంలో డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. ఈ డిజిటల్ హెల్త్ కార్డులు రేషన్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ఒకే కార్డులో కలిపి పని చేస్తాయని ప్రభుత్వం తెలిపింది.
ఈ పథకంలో భాగంగా, రాష్ట్రంలోని అన్ని 119 నియోజకవర్గాల్లో ప్రత్యేక హెల్త్ ప్రొఫైల్ సర్వే నిర్వహించి డిజిటల్ కార్డులు అందించనున్నారు. అక్టోబర్ 3 నుండి 7 వరకు సర్వే జరుగుతుందని, ఇంటింటికి వెళ్లి కుటుంబంలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్‌ను రికార్డు చేయనున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు. స్మార్ట్ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ద్వారా కుటుంబ సభ్యుల పూర్తి ఆరోగ్య సమాచారం పొందుపరచబడుతుందని, ఈ డిజిటల్ కార్డులు ఇప్పటికే అమలులో ఉన్న ఆరోగ్యశ్రీ కార్డులను రీప్లేస్ చేస్తాయని చెప్పారు.
ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేక డిజిటల్ హెల్త్ కార్డు జారీ చేసి, కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తూ కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను నమోదు చేస్తారు. ఆరోగ్య సమస్యలను చక్కగా నియంత్రించేందుకు ఈ డిజిటల్ కార్డులు తోడ్పడతాయని, సక్రమంగా హెల్త్ ప్రొఫైల్ నిర్వహించడం ద్వారా వైద్య సేవలను మెరుగుపరచగలమని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ప్రాజెక్టులో పొరపాట్లకు తావులేకుండా అధికారులు జాగ్రత్తగా సర్వే నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మొత్తం 238 ప్రాంతాల్లో మొదటిదశగా ఈ సర్వే నిర్వహించి, సేకరించిన వివరాల ఆధారంగా డిజిటల్ కార్డులు జారీ చేయనున్నారు.
ఈ డిజిటల్ కార్డుల ద్వారా పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సమానంగా ఆరోగ్య రక్షణ లభించడమే ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం ప్రకటించింది. సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలకు మేలు చేయడమే ఈ పథకానికి ప్రధాన లక్ష్యమని అన్నారు.