అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో హోటల్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. స్విగ్గీ ఫుడ్ డెలివరీ యాప్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, అక్టోబర్ 14 నుంచి స్విగ్గీని బహిష్కరించనున్నట్లు ప్రకటించింది. నగదు చెల్లింపుల్లో జాప్యం, హోటల్స్‌కు నష్టాలను కలిగించే విధంగా స్విగ్గీ వ్యవహరిస్తోందని అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు.
విజయవాడలో హోటల్స్ యాజమాన్యాలు సమావేశమై స్విగ్గీ వ్యవహారంపై చర్చించాయి. చెల్లింపుల జాప్యం, అధిక కమిషన్ వసూలు చేస్తూ రెస్టారెంట్లను ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డాయి. ఇప్పటికే ఆగష్టు 12, 27, సెప్టెంబర్ 27 తేదీల్లో స్విగ్గీ, జొమాటో ప్రతినిధులతో చర్చలు జరిపినా, స్విగ్గీ తమ అభ్యంతరాలను అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్‌వీ స్వామి, కమిటీ కన్వీనర్ రమణారావు మాట్లాడుతూ, “స్విగ్గీ కారణంగా హోటల్స్‌కు తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతోంది. సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో పాటు వివిధ విధానాలు అమలు చేయడం వల్ల మా వ్యాపారాలు నష్టపోతున్నాయి,” అని తెలిపారు.
అక్టోబర్ 14నాటికి స్విగ్గీ తమ షరతులు సడలిస్తే చర్చలకు సిద్ధమని, లేకపోతే రాష్ట్రంలోని హోటల్స్ మరియు రెస్టారెంట్లలో స్విగ్గీ అమ్మకాలు నిలిపివేస్తామని అసోసియేషన్ స్పష్టం చేసింది.