మధురై: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తమిళనాడు మధురైలో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. తిరుపతి వారాహి సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారి, దీంతో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నంగా అభివర్ణిస్తూ మధురై న్యాయవాది వాంచినాథన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా, పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌పై పరోక్షంగా విమర్శలు చేయడం, సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి తాను సిద్ధమని చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణమయ్యాయి.
తిరుపతి సభలో, “సనాతన ధర్మం అనేది ఒక వైరస్ అని చెప్పిన వారు చరిత్రలో ఎన్నోమంది వచ్చారు, పోయారు,” అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర విమర్శలకు దారి తీశాయి. తమిళనాడులోని న్యాయవాది వాంచినాథన్, పవన్ వ్యాఖ్యలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నాయంటూ, మధురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో, పవన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి ప్రతిష్ఠకు భంగం కలిగించాయంటూ అభియోగాలు చేశారు. ఈ నేపథ్యంలో మధురై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది.
డీఎంకే వర్సెస్ జనసేన
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా, డీఎంకే సోషల్ మీడియా వేదికగా పవన్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించింది. పాత వీడియోలను తెరపైకి తీసుకువస్తూ పవన్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ మొదలయ్యాయి. వాంచినాథన్ ఫిర్యాదుతో పాటు, కేసు నమోదవ్వడం ఈ వివాదాన్ని మరింత హీటెక్కిస్తోంది.
లడ్డూ వివాదంపై పవన్ స్పందన
ఇక, తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీం కోర్టు ఆదేశించిన స్వతంత్ర సిట్ దర్యాప్తును పవన్ కల్యాణ్ స్వాగతించారు. సిట్ దర్యాప్తు ద్వారా సత్యం బయటపడుతుందని, ఈ విచారణతో న్యాయం జరుగుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు సిట్ లో సీబీఐ, ఏపీ పోలీసుల ప్రతినిధులతో పాటు FSSAI నుంచి సీనియర్ అధికారిని నియమించాలని ఆదేశించిన నేపథ్యంలో, పవన్ ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు.