బిజినెస్ డెస్క్: అదానీ గ్రూప్ పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్ట్ వెలువరించిన తర్వాత, వాళ్ళ స్టాక్స్ పతనం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదం మరో మలుపు తిరిగింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చీఫ్ మాధబి పురీ బచ్‌పై కూడా
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేసింది. వీటిని పరిశీలించేందుకు పార్లమెంటరీ కమిటీ ఆమెకు సమన్లు జారీ చేసింది.
సెబీ చీఫ్ మాధబి పురీ బచ్, ట్రాయ్ ఛైర్ పర్సన్ అనిల్ కుమార్ సహా పలు అధికారులను పీఏసీ (పార్లమెంటరీ అప్రయల్స్ కమిటీ) ముందు అక్టోబర్ 24న హాజరుకావాలని ఆదేశించింది. కమిటీ దేశంలోని రెగ్యులేటరీ అథారిటీల పనితీరును సమీక్షించే క్రమంలో ఈ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే మాధబి, అనిల్ కుమార్ లు వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం తక్కువగా ఉందని, వారి తరఫున సీనియర్ అధికారులు ప్రాతినిధ్యం వహించనున్నారని తెలుస్తోంది.
సెబీ చీఫ్ మాధబి పురీ ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్నారు. అదానీ షేర్ల పతనం జరిగిన తర్వాత, ఐసీఐసీఐ బ్యాంకు జీతభత్యాల విషయంలోనూ ఆమె వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్, మాధబి పురీ మరియు ఆమె భర్త ధావల్ బచ్‌పైన కూడా ఆరోపణలు చేసింది, అయితే వారు అవన్నీ తప్పుడు ఆరోపణలని ఖండించారు.
ఇప్పటి వరకు వివిధ అంశాల్లో సెబీ చీఫ్ చుట్టూ వివాదాలు ముసురుకుంటూనే ఉండటంతో, పీఏసీ ఆమెకు సమన్లు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ భారీ పతనాన్ని చవిచూశాయి, దీంతో ఇన్వెస్టర్లకు కూడా పెద్ద నష్టం తగిలింది. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు కూడా చేరిన సంగతి తెలిసిందే.