అంతర్జాతీయం: లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం ఘోర మారణహోమం సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ గగనతల దాడుల్లో హిజ్బుల్లా కీలక నేత హషీమ్ సఫీద్దీన్ జాడ తెలియరాలేదని హిజ్బుల్లా వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో, ఇజ్రాయెల్ దళాలు సెంట్రల్ గాజాలోని ఒక మసీదుపై బాంబుల వర్షం కురిపించాయి. అక్టోబర్ 6న జరిగిన ఈ దాడుల్లో 21మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర గాజా ప్రాంతంలో దాడులు పెరుగుతుండటంతో, ఇజ్రాయెల్ సైన్యం అక్కడి ప్రజలను ఖాళీ చేయించింది.
ఇక లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ శివారుపై ఇజ్రాయెల్ సైన్యం బాంబుల దాడులు ముమ్మరంగా జరిపింది. ఈ దాడుల తీవ్రతకు బీరుట్ ప్రాంతం శాంతి భంగమైంది. 30 నిమిషాల పాటు ఆకాశంలో ఎరుపు, తెలుపు మెరుపులు కనిపించాయి. హిజ్బుల్లా నేతలు సమావేశమయ్యారని భావించిన బంకర్‌పై జరిగిన ఈ దాడులు హషీమ్ సఫీద్దీన్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగాయని సమాచారం. సఫీద్దీన్ మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, అధికారికంగా నిర్ధారణ కాలేదు.
ఈ పరిణామాల మధ్య, ఇజ్రాయెల్ తన దాడులను మరింత ఉధృతం చేస్తోంది. దక్షిణ లెబనాన్ ప్రాంతాలతో పాటు బెకా వ్యాలీ, ట్రిపోలీ వంటి కీలక ప్రాంతాలు లక్ష్యంగా మారాయి. ఇజ్రాయెల్ సైన్యపు ప్రకటన ప్రకారం, సిప్టెంబర్ 27న బీరుట్‌లోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై జరిపిన దాడిలో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి చెందాడని వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పారిస్, న్యూయార్క్, కేప్ టౌన్ సహా పలు నగరాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ఇక, హమాస్ దాడికి ఏడాది కావొస్తున్న తరుణంలో, ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ తన ప్రతీకార యుద్ధాన్ని మరింత కఠినంగా సాగిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 42,000 మంది పాలస్తీనియన్లు చనిపోగా, 2.3 మిలియన్లకు పైగా ప్రజలు శరణార్థులుగా మారినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.