వరంగల్ : దేశంలో కరోనా విజృంభిచడం మొదలైనప్పటి నుండి ముందు వరుసలో ఉండి పోరాడుతున్న సైనికులు డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలిసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆంధ్రప్రదేశ్ లో వీరితో పాటు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వారి ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడుతున్నారు.
చాలా చోట్ల ఈ సైనికులు ఆ కరోనా బారిన పడి ప్రాణాలను వదిలిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కరోనా పాజిటివ్ వచ్చిన రోగులను అయిన వారే పట్టించుకోని పరిస్థితుల్లో డాక్టర్లు, నర్సులు ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్నారు.
ఇది అందరికీ తెలిసిన నిజం. అలాంటి డాక్టర్లు ఈ రోగాన పడిన సందర్భంలో వారిని కూడా వివక్షతో చూస్తున్న సమాజంలో మనం ఉన్నాం. తాజా ఘటన ఒకటి మనుషుల ఈ విపరీత ధొరణి కి అద్దం పడుతోంది.
వరంగల్ నగరంలో ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా పేషెంట్ బంధువులు డాక్టర్‌పై చేయి చేసుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బంధువు మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ వార్డులోని అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.