fbpx
Friday, October 18, 2024
HomeNationalజమ్ము కశ్మీర్, హరియాణా ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్త ఉత్కంఠ

జమ్ము కశ్మీర్, హరియాణా ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్త ఉత్కంఠ

Nationwide -excitement -over- Jammu -Kashmir -and -Haryana- election -results

జాతీయం: జమ్ము కశ్మీర్, హరియాణా ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్త ఉత్కంఠ

జమ్ముకశ్మీర్, హరియాణా రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలకు అన్నీ సిద్ధమయ్యాయి. ఈ ఎన్నికలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి, ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌లో 2019లో ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగింపుపై వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. హరియాణాలో కూడా ఈసారి బీజేపీకి హ్యాట్రిక్ విజయం వస్తుందా, లేక కాంగ్రెస్ శక్తివంతమైన పునరాగమనాన్ని సాధిస్తుందా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

జమ్ముకశ్మీర్‌లో హంగ్ అసెంబ్లీకి అవకాశం

90 స్థానాలున్న జమ్ముకశ్మీర్‌లో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్ పోల్స్‌ ప్రకారం ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాబట్టే స్థితిలో లేనట్లు తెలుస్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇతర పార్టీల మద్దతు అవసరం కావచ్చని అంచనా. బీజేపీ 20-32 స్థానాల్లో గెలిచే అవకాశముందని, పీడీపీ మాత్రం ఒక్క అంకెలకే పరిమితం కావచ్చని సర్వేలు చెబుతున్నాయి.

హరియాణాలో కాంగ్రెస్‌ పోటీగా..

హరియాణాలో 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ పూర్తయ్యింది. ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం, ఈసారి కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో బీజేపీ, జేజేపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ, తాజా పరిణామాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం రేసులో భూపీందర్ సింగ్ హుడ్డా ముందంజలో ఉన్నారు.

నామినేట్ ఎమ్మెల్యేల వివాదం తెరపై

జమ్ముకశ్మీర్‌లో నామినేట్ ఎమ్మెల్యేల నియామకం అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర హోం శాఖ సలహా మేరకు ఐదుగురు ఎమ్మెల్యేలను నామినేట్ చేస్తామని ప్రకటించడంపై కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్‌, పీడీపీ పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. వీరి నియామకాలు ప్రజా తీర్పును కాలరాసినట్లేనని ఆ పార్టీలు మండిపడుతున్నాయి.

చర్యలు

ఇక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఏ రకమైన హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు, భద్రతా విభాగాలు చర్యలు చేపట్టాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular