అజ్మేర్: రాజస్థాన్‌లోని అజ్మేర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ బార్ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాదులు విహారయాత్రలో పాల్గొనడానికి రెండు బస్సుల్లో అజ్మేర్ వెళ్ళగా, మంగళవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ భార్య జ్యోత్స్న అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ప్రమాదం వివరాలు
మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో, ఆగి ఉన్న ట్రక్కును న్యాయవాదుల బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో సుంకర రాజేంద్రప్రసాద్ సహా 11 మంది న్యాయవాదులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అత్యవసరంగా సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విహార యాత్రలో అపశృతి
విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు రాజస్థాన్‌లోని పుణ్య క్షేత్రం అజ్మేర్ సందర్శన కోసం బయలుదేరి వెళ్లారు. కానీ ఈ యాత్ర అజ్మేర్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంతో విషాదాంతం అయ్యింది. ఈ ప్రమాదం తీవ్ర విషాదానికి దారి తీసింది.