న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) రెండు రోజుల ఢిల్లీ పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు. బుధవారం ఉదయం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరారు. ఈ పర్యటనలో చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)తో పాటు ఏడుగురు కేంద్రమంత్రులను (అశ్విని వైష్ణవ్, నితిన్ గడ్కరీ, హార్దీప్ సింగ్ పూరి, కుమార స్వామి, పీయూష్ గోయల్, అమిత్ షా, నిర్మలా సీతారామన్) కలసి రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన అంశాలపై చర్చలు జరిపారు.
నిన్న సాయంత్రం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు తమ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని, కేంద్రం కూడా ప్లాంట్ పరిరక్షణ కోసం సహకరించేందుకు సిద్ధంగా ఉందని చంద్రబాబు తెలిపారు. ప్లాంట్ సమస్యలను పరిష్కరించేందుకు సెయిల్‌లో విలీనం చేయడం ఒక ఆలోచనగా ఉందని, ఇందుకు సెయిల్ మరియు కేంద్రం అంగీకరించాలి అని అన్నారు. అలాగే, ఐరన్ ఓర్ సరఫరా సమస్యను సెయిల్ తరహాలో విశాఖ ఉక్కు కర్మాగారానికి పరిష్కరిస్తే పెద్ద సమస్యలు తొలగుతాయి అని పేర్కొన్నారు.
చంద్రబాబు తన పర్యటనలో పీఎంయూవై కింద రాష్ట్రానికి నిధుల పెంపు, అమరావతి రాజధాని నిర్మాణానికి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, జాతీయ రహదారుల మంజూరు తదితర అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, ఆయా అంశాలపై కొన్ని నిర్దిష్టమైన హామీలు కూడా పొందినట్టు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు కోసం రూ. 12,500 కోట్లు కేంద్రం విడుదల చేసినట్లు తెలిపారు. రెండు సంవత్సరాల్లో భోగాపురం విమానాశ్రయం, సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ పనులు పూర్తి కానున్నాయని పేర్కొన్నారు.
అదేవిధంగా, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం రేవుల పరిశీలనలో కేంద్రం బీపీసీఎల్ రిఫైనరీ కోసం తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. హైదరాబాద్-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే విస్తరణ, గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే వంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి కేంద్రం నుండి సహకారం కోరినట్లు, దీనిపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించినట్టు చంద్రబాబు వెల్లడించారు.
అత్యంత ముఖ్యంగా, జగన్ సర్కారు పాలనలో యుటిలిటీ సర్టిఫికెట్లు కాలానుగుణంగా సమర్పించాక పోవడం వాళ్ళ రాష్ట్రానికి తగిన నిధులు విడుదల కాలేదని, ఈ అనారోగ్య పరిస్థితిని సరిదిద్ది, ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ప్రధాని మోదీ సహకారం కోరినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం మిగిల్చిన ఆర్థిక, పరిపాలనా సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.