హైదరాబాద్: నగరంలో చేతబడి పేరుతో మోసాలకు పాల్పడుతూ లక్షల రూపాయలు కొల్లగొడుతున్న దొంగ ఫకీరు ఖలీం అరాచకాలకు సౌత్‌ఈస్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళం పాడారు. బహదూర్‌పురాకు చెందిన మహ్మద్ ఖలీమ్ అలియాస్ ఖలీ, ఒకప్పుడు రౌడీషీటర్‌గా చలామణీ అయిన ఈయన ఒకప్పుడు వాల్ పెయింటింగ్ పనులు చేసేవాడు. అయితే సులభంగా డబ్బు సంపాదించేందుకు బ్లాక్ మ్యాజిక్ పేరుతో మోసాలకు తెరతీశాడు.
ఈ నేపథ్యంలో, నజియా అనే మహిళ ఖలీం వద్దకు వచ్చింది. ఆమె తన అత్తామామలను చేతబడి చేసి అంతమొందించాలని కోరింది. ఖలీమ్ ఆమెకు అంగీకారం తెలిపి కుంకుమ, పసుపు, అగర్బత్తి, గోధుమపిండి వంటి వస్తువులతో చేతబడి చేస్తున్నట్లు నటించాడు.
అయితే ఈ కార్యక్రమం ఎలాగో తెలుసుకున్న అత్తమామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు బండ్లగూడ పోలీసులతో కలిసి దాడి చేసి, ఖలీం మరియు నజియాను అదుపులోకి తీసుకున్నారు. బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.