ఇంటర్నెట్ డెస్క్: విదేశాలకు ప్రయాణించే వారికి త్వరలో ఎయిర్‌పోర్ట్‌లో చెకింగ్ కోసం ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ (FRT) ఆధారంగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ‘డిజియాత్ర‘ సేవలు, ఇప్పటివరకు కేవలం దేశీయ ప్రయాణాలకు మాత్రమే పరిమితం కాగా, ప్రభుత్వం ఈ సదుపాయాన్ని అంతర్జాతీయ ప్రయాణాలకు కూడా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2025 జూన్‌లో దీని పై తొలి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని డిజియాత్ర సీఈఓ కె. సురేశ్ వెల్లడించారు.
2025లో అంతర్జాతీయ ప్రయాణాలకు ‘డిజియాత్ర’ ప్రయోగం
“ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని అంతర్జాతీయ ప్రయాణాల కోసం వినియోగించాలంటే, గమ్యదేశం కూడా దీనికి అంగీకరించాలి” అని సురేశ్ తెలిపారు. దీని మొదటి దశలో, 2025 జూన్ నాటికి రెండు దేశాల మధ్య ప్రయాణం కోసం ఈ సదుపాయాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఎఫ్‌ఆర్‌టీ ఆధారిత డిజియాత్ర సేవలు
ప్రస్తుతం దేశీయ విమాన ప్రయాణాలకు డిజియాత్ర యాప్‌ను అభివృద్ధి చేయడం జరిగింది. ఈ యాప్‌లో ఆధార్ ఆధారంగా ప్రయాణికుల ముఖ చాయలను, ఇతర వివరాలను నిక్షిప్తం చేయొచ్చు. ఒకసారి వివరాలు అప్‌లోడ్ చేయబడిన తర్వాత, ప్రతి ప్రయాణానికి ముందు బోర్డింగ్ పాస్‌ను యాప్‌లో జత చేస్తే సరిపోతుంది. విమానాశ్రయంలో డిజియాత్ర కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రవేశ మార్గాల్లో ఈ టెక్నాలజీ ద్వారా సెకన్లలోనే ప్రవేశం పొందొచ్చు.
విమానాశ్రయంలో వేగవంతమైన ప్రవేశం
హైదరాబాద్, దిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన ఎయిర్‌పోర్ట్స్ సహా, మరికొన్ని నగరాల్లో డిజియాత్ర సేవలకు ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేశారు. మొబైల్ యాప్‌లో బోర్డింగ్ పాస్ స్కాన్ చేసి, కెమెరా ముందు ముఖాన్ని ఉంచితే గేట్లు ఆటోమేటిక్‌గా తెరచుకుని, ప్రయాణికులు మరింత వేగంగా ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించవచ్చు. ఈ సదుపాయం ప్రస్తుతం కేవలం దేశీయ ప్రయాణాలకే అందుబాటులో ఉంది.
ఇ-పాస్‌పోర్ట్‌లు త్వరలో అందుబాటులోకి
అంతర్జాతీయ ప్రయాణాలకు పాస్‌పోర్ట్, వీసా, ఇమిగ్రేషన్‌కు సంబంధించిన వ్యవహారాలు ఉన్నందున, డిజియాత్ర సేవలను అంతర్జాతీయంగా విస్తరించడానికి ఇమిగ్రేషన్ విభాగం, వీసా జారీ వ్యవస్థలతో సమన్వయం అవసరం ఉంటుంది. ఇ-పాస్‌పోర్ట్ సదుపాయాన్ని కూడా త్వరలో భారతీయ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సింగపూర్ వంటి దేశాలు ఇ-పాస్‌పోర్ట్‌లను అందిస్తున్నారు, తద్వారా ప్రయాణికుల ఇమిగ్రేషన్ పనితీరు మరింత సులభం కానుంది.