హైదరాబాద్: తెలంగాణ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది రేవంత్ సర్కార్. విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి త్వరలోనే భారీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) వెల్లడించారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం సందర్భంగా, ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయనున్నట్లు స్పష్టత ఇచ్చారు.
ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి
విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఈ నోటిఫికేషన్ ద్వారా విద్యుత్ శాఖలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయనున్నామని, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ఒకటైన నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం ఇందుకు ఉదాహరణ. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు భారీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.
డీఎస్సీ 2008 ధ్రువపత్రాల పరిశీలన చివరి దశకు
ఈ క్రమంలో, డీఎస్సీ 2008 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చివరి దశకు చేరుకుంది. ఎస్జీటీల నియామకానికి సంబంధించి 186 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు పిలువగా , అందులో కేవలం 96 మంది మాత్రమే హాజరయ్యారు. మిగిలిన అభ్యర్థులు రాకపోవడం విస్మయం కలిగించింది. వీరంతా, ముఖ్యంగా పదో తరగతి మార్కుల మెమోలు లేకపోవడంతో హాజరుకాలేకపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ అభ్యర్థులు మరొక అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
అధికారులు సానుకూలంగా
ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు సానుకూలంగా అవకాశం కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర విద్యాశాఖ సానుకూల వైఖరిలో ఉన్నట్లు సమాచారం.